తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక హడావుడి మొదలైంది. ప్రస్తుతం అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక చేయాల్సి ఉంది. దీని కోసం నాయకుల అభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా. టి. పార్టీలోని నేతల్ని ఒక్కొక్కరిగా సంప్రదిస్తూ, ఎవరికి బాధ్యతలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే, ఈ పదవి రేస్ లో ఇప్పటివరకూ ప్రముఖంగా వినిపించిన పేర్లు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు. తాజాగా మరో ఇద్దరి పేర్లూ తెరమీదికి ప్రముఖంగానే వస్తున్నాయి. జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అధ్యక్ష పదవి ఆశావహుల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏ ప్రాతిపదికన కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగాలనే అంశమ్మీద ఆసక్తికరమైన చర్చ తెర మీదికి వస్తోంది. ప్రస్తుతం టి. కాంగ్రెస్ లో వలసల జోరు కొనసాగే అవకాశం ఉంది. వరుస ఓటములు ఎదుర్కొంటున్న పార్టీని మరింత బలహీన పరచడం ద్వారా, రాష్ట్రంలో ఎదగాలని భాజపా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క, రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి ఎన్నోయేళ్లుగా విధేయులుగా ఉన్నవారికి హైకమాండ్ అవకాశం ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని ఇవ్వాలంటే… వీర విధేయులకే పీసీసీ పదవి ఇవ్వాలనే దిశగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఈ ఫార్ములా తెర మీదికి రాగానే… రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. ఎందుకంటే, పార్టీ కేడర్ సరైన నాయకత్వం కోసం చూస్తోంది. ఓటమి భారంతో ఉన్న కేడర్ లో కొత్త జోష్ నింపాలంటే.. మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలూ ఈ మధ్య బాగా వినిపించాయి. హైకమాండ్ దగ్గర కూడా రేవంత్ కి సంబంధించి ఇదే పెద్ద ప్లస్ పాయింట్ గా ఉందనీ అన్నారు! అంతేకాదు… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చే ముందే, పీసీసీ పదవి ఇస్తామని హైకమాండ్ మాటిచ్చినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే… పార్టీకి ఎన్నోయేళ్లగా లాయల్ గా ఉన్నవారికే ప్రాధాన్యత అంటే… శ్రీధర్ బాబు వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. ఎందుకంటే, ఆయన తండ్రి కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. క్షేత్రస్థాయిలో కేడర్ లో కొత్త జోష్ రావాలంటే… రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మంచిదనేది కొంతమంది అభిప్రాయం. శ్రీధర్ బాబుకు అవకాశం ఇస్తే… వలసల సీజన్ కాబట్టి, పార్టీకి కట్టుబడి ఉన్నవారికే ప్రాధాన్యత అనే సందేశం ఇచ్చినట్టు అవుతుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డికి విషయానికొస్తే… పార్టీలో ఆయన సౌమ్యుడిగా పేరుంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డికి… పార్టీకి లాయలిస్టు అనే ఇమేజ్ ఉంది. మిగతా పేర్లూ, వారికి ఉన్న సానుకూలతలూ ఒకెత్తు అయితే… ఇప్పుడు రేవంత్ పరిస్థితి ఏంటనేది కొంత ఆసక్తికరంగా మారుతోంది.