కేంద్రంలో సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ కు ఊరటనిచ్చినా రేవంత్ కు మరో గండం పొంచి ఉంది. తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకోని జోష్ మీదున్న బీజేపీ…రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఈమేరకు టీడీపీ, జనసేన సహాయంతో తెలంగాణలోనూ పాగా వేసేలా స్కెచ్ వేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉండటంతో ఇక నుంచి తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేయనున్నాయి. తెలంగాణలో పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నా…టీడీపీ సొంతంగా పోటీ చేసే అవకాశం లేదు. ఈ క్రమంలోనే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయలు చేయాలని తలపోస్తున్నారు.
ఈ క్రమంలోనే గ్రేటర్ లో ఇప్పటికి మంచి పట్టున్న టీడీపీతోపాటు జనసేనతో కలిసి బీజేపీ ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. పైగా…బీఆర్ఎస్ లోనున్న ఎమ్మెల్యేల్లో కొంతమంది బీజేపీలో చేరుతారు అనే ప్రచారమే నిజమైతే బీజేపీకి అది మరింత అడ్వాంటేజ్ కానుంది.దీంతో రేవంత్ కు ఓ ముప్పు తొలగినా ఎన్డీయే కూటమి రూపంలో మరో ముప్పు దూసుకొస్తుంది.
తెలంగాణలోనూ ఈ కూటమిని డీకొడుతూ బీఆర్ఎస్ ను ఎదుర్కొంటూ రేవంత్ ఈ సుడిగుండం నుంచి ఎలా బయటపడుతారో చూడాలి. మొత్తంగా గ్రేటర్ ఎన్నికలు రేవంత్ కు కత్తి మీద సామేనని అంటున్నారు విశ్లేషకులు.