అవును చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపించారు.. అయితే ఏంటి ? కాంగ్రెస్ లోకి కోడలిగా వచ్చానని.. పార్టీని అధికారంలోకి తెచ్చి పెడతానని ఆయన మునుగోడులో చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా కాలంగా విపక్ష పార్టీల నేతలు రేవంత్ రెడ్డిని చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారని విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు ఎదురుదాడే సమాధానం అవడంతో పాటు… అంత కంటే కీలకంగా ఇటీవలి కాలంలో తెలంగాణలోని టీడీపీ ఓటు బ్యాంక్.. కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని… చంద్రబాబుతో సీట్ల షేరింగ్ లేని ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నంలో ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఈ కారణంగానే రేవంత్ రెడ్డి విపక్షాల విమర్శలకు రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో టీడీపీ ఫ్యాన్స్‌లో చీలిక తెచ్చి తన వైపు కొంతమందిని ఉంచుకోగలిగేలా ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా టీడీపీ క్యాడర్లో ఆయనపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. కేసీఆర్ ను ఢీకొట్టగలిగే నేత ఆయనొక్కడే అని నమ్ముతారు. అదే సమయంలో చంద్రబాబును ఇప్పటికీ అభిమానిస్తారు. ఎలాంటి విమర్శలు చేయరు. ఇది కూడా ఆయనపై సాఫ్ట్ కార్నర్ ఏర్పడటానికి కారణం అయింది. చంద్రబాబుపై రేవంత్ ఎలాంటి విమర్శలు చేయకపోవడానికి తెలంగాణలో టీడీపీ క్యాడర్ అభిమానం పొందడానికి వేసిన స్కెచ్ అనే అభిప్రాయం ఎప్పటి నుండో ఉంది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ లో పుట్టి పెరగకపోయినప్పటికీ… తాను కోడలిగా వచ్చానని.. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అలాగే వెళ్లి టీడీపీ గౌరవాన్ని నిలబెట్టారని.. తాను అలా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి కాంగ్రెస్‌కి అధికారాన్ని తెచ్చి పెడతానని సవాల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్‌కు లోటు లేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారో అంత రాటుదేలిపోయారు. దేన్నైనా డైరక్ట్‌గా ఎదుర్కొంటున్నారు. రాజకీయానికి రాజకీయమూ చేస్తున్నారు.