రెబల్స్మి అని చెప్పుకుని ప్రచారం చేసుకుని ప్రముఖ నేతలుగా మారాలని ప్రయత్నించే వారికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందుగానే గట్టి షాక్ ఇస్తున్నారు. ఎవరైనా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా తేలితే వెంటనే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి దొంగలున్నారని వారి పని పడతామని నేరుగానే హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిగం ఠాగూర్ నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షంచారు. ఈ సందర్భంగా కొంత మంది నేతలు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి.. గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు.
ఫ్లెక్సీల్లో రేవంత్ ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. దళిత, గిరిజన దండోరా వేదికల్ని ఏకపక్షంగా ప్రకటిస్తున్నారని వారు పాత కాంగ్రెస్ తరహాలో రచ్చ చేయబోయారు. అది అంతర్గత సమావేశం . తర్వాత తాము అలా చేశామన్న విషయాన్ని మీడియాకు కూడా లీక్ చేశారు. ఇదే ఇంటిదొంగల పనిగా భావించిన రేవంత్ రెడ్డి చర్యలు ప్రారంభించారు. టీ నిరంజన్, ఘంటా సత్యనారాయణరెడ్డి అనే నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారు చేసిన పనికి సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో పలుకుబడి లేకుండా గాంధీభవన్‌లో మాత్రమే సీనియర్లుగా.. నేతలుగా చెలామణి అయ్యే కొంతమంది వల్లే సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి గుర్తించినట్లుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కయి… ఇలా పార్టీ వ్యతిరేక పనులు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ఇలాంటివారిని గుర్తించి ముందు బయటకు పంపేయాలని రేవంత్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వారిపై రేవంత్‌కు స్పష్టమైన సమాచారం ఉందని.. అందుకే బహిరంగ వేదికలపైన కూడా కోవర్టుల గురించి చెబుతున్నారని అంటున్నారు. రేవంత్ దూకుడుగా వ్యతిరేకంగా ప్రకటనలు చేయాలనుకుంటున్న వారు కూడా ముందూ వెనుకా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.