గులాబీ పార్టీ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. విచ్చలవిడిగా సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. గ్రేటర్ ప్రజలకు మాత్రమే కాదు. ప్రత్యర్థి పార్టీల నేతలకు కూడా ఎవరు ఏం కోరితే అది కానుకలు ఇచ్చేసే తరహా మూడ్‌లో తెరాస చెలరేగుతున్నది. తెరాస అభ్యర్థుల ఇళ్లు, డివిజన్లలో తెరాస కార్యాలయాల వద్ద ఎలాగైతే ఉత్సాహం పరవళ్లు తొక్కుతూ, టపాకాయలు పేలుతూ ఉన్నాయో అదే తరహాలో.. గ్రేటర్ రాజకీయ వర్గాల్లో వారి విజయం మరియు ప్రత్యర్థి పార్టీల దారుణమైన పరాజయాల మీద పంచ్‌ల మీద పంచ్‌లు, జోకులు పేలుతున్నాయి.
అన్నిటికంటె పెద్ద పంచ్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మీదనే పేలుతున్న మాట వాస్తవం. తాము వంద సీట్లు గెలుస్తాం అంటూ కేటీఆర్ విశ్వాసం ప్రకటిస్తే.. గులాబీ జెండా మేయర్ పీఠం మీద ఎగరకపోతే మంత్రిగా రాజీనామా చేస్తా అని కేటీఆర్ ప్రకటిస్తే.. దానికి రేవంత్‌రెడ్డి మరింత ఘాటుగా ప్రతిసవాళ్లు విసిరారు. తెరాసకు వంద సీట్లు వస్తే గనుక.. తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ చాలా ఆర్భాటంగా ప్రకటించారు.
అందుకే ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి కేటీఆర్.. రేవంత్‌రెడ్డికి కాషాయవస్త్రాలు కానుకగా పంపిస్తారా? అని నాయకులు జోకులు వేసుకుంటున్నారు. కేటీఆర్‌కు ప్రతిసవాళ్లు విసిరిన వారంతా ఇప్పుడు మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియక సతమతం అవుతున్నారన్నమాట వాస్తవం. ఈ విజయం పూర్తిగా కేటీఆర్ కష్టానికి ఫలితం అంటూ మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా కితాబులు ఇచ్చారు.
అప్పుడే మాట మార్చిన రేవంత్‌రెడ్డి
తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాత్రం అప్పుడే మాట మార్చేశారు. తాను ఎవ్వరికీ సవాళ్లు విసరలేదని… కేటీఆరే ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసిరారని ఆయన ఇప్పుడు అంటున్నారు. కేటీఆర్ కు తాను సవాలు విసరలేదని రేవంత్ అంటున్నారు. తన రాజకీయ సన్యాసం గురించి ఎవ్వరూ నోరెత్తకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోందని జనం నవ్వుకుంటున్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.