మంత్రి పదవిపై రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ గెలిచినప్పుడే తనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ చాన్స్ రాకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. అప్పట్లోనే వైసీపీ హైకమాండ్ బుజ్జగించింది. ఎపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చింది. మొదటి నుంచి జగన్ వెంట నడిచిన అతికొద్ది మంది నేతల్లో రోజా ఒకరు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా కష్టపడ్డారు. ఢీ అంటే ఢీ అన్నారు. ఈ పోరాటంతో పాటు.. విధేయతను చూసి జగన్ మంత్రి పదవి ఇస్తారని రోజా ఆశలు పెట్టుకున్నారు.
రోజా టీడీపీలోనే ఉండి ఉంటే.. 2014 నుంచి 2019 వరకూ మంత్రిగా ఉండేవారని టీడీపీ వర్గాలు చెబుతూ ఉంటాయి. పార్టీలో ఆమె చంద్రబాబు ఆమెను చాలా ప్రోత్సహించారని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయంలో ఆమె పార్టీలో ఉండి ఉంటే.. మహిళా కోటా.. రెడ్డి సామాజకివర్గ కోటా కింద ఖచ్చితంగా పదవి వచ్చి ఉండేదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఓ సారి అవకాశం కోల్పోయారు. ఇప్పుడు మరోసారి చాన్స్ వచ్చింది. ఇప్పుడు మిస్సైతే ఆమె స్పందన ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది.
జగన్ మంత్రి పదవి ఇవ్వకపోతే రోజా ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశమవుతోంది. ఆమె దూకుడైన నేత. తనకు అన్యాయం జరిగిందని భావిస్తే ఊరుకోరని ఆమె నైజం తెలిసిన వాళ్లు అంటున్నారు. అయితే ఆమె జగన్పై ఘాటు భాషను ప్రయోగించకపోవచ్చు కానీ అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉండరని అంటున్నారు. మొత్తంగా రోజా వైపే వైసీపీలో ఎక్కువ మంది చూస్తున్నారు. పదవి దక్కితే జగన్ను ఆమె పొగిడినట్లు ఎవరూ పొగడరు. దక్కకపోతేనే అసలు సమస్య.