తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతోందా? ముగిసిపోయిందా? దీనికి ఏం సమాధానం చెప్పుకోవాలి? కొనసాగుతూ ముగిసిపోయిందని చెప్పుకోవాలా? ముగిసిపోయినట్లుగా అనిపిస్తూ కొనసాగుతోందని చెప్పుకోవాలా? సమ్మె విరమించామని మొన్న చెప్పిన జేఏసీ కన్వీనర్ అశ్వద్థామ రెడ్డి తాజాగా సమ్మె కొనసాగుతూనే ఉందని చెప్పాడు. సమ్మె ముగిసిపోతే కార్మికులు విధుల్లో చేరాలి కదా. ఎక్కడా విధుల్లో చేరడంలేదు. చేరడంలేదంటే ఉద్దేశపూర్వకంగా చేరకపోవడంకాదు, యాజమాన్యం చేర్చుకోవడంలేదు. ‘మేం విధుల్లో చేరతాం మహాప్రభో’ అని కార్మికులు పోలోమంటూ బస్సు డిపోల దగ్గరకు వెళ్లి బారులు తీరుతున్నా డిపో మేనేజర్లు ‘మాకు పైనుంచి ఆదేశాలు లేవు చేర్చుకోం’ అంటున్నారు. కొన్ని చోట్ల కార్మికులు వంటావార్పు చేసుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సుదీర్ఘ సమ్మె పుణ్యమా అని కార్మిక సంఘాల్లో విభేదాలు కూడా వచ్చాయి.
ఇప్పుడంతా అయోమయం జగన్నాథంగా ఉంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కేసీఆర్ పైచేయి సాధించినట్లయింది. సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ‘కోర్టు ఏమైనా కొడతదా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన అనుకున్నట్లుగానే హైకోర్టు కొట్టలేదు. నిన్ను కొట్టే శక్తి (చర్చలు జరపాల్సిందేనని ఆదేశించే అధికారం, సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించే అధికారం) మాకు లేదు నాయనా అని చెప్పడమే కాకుండా, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సమర్థించి రైట్…రైట్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆశలు ఆవిరైపోయాయి. ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అన్న మాదిరిగా డ్యూటీల్లో చేరతామంటూ డిపోల దగ్గర బారులు తీరుతున్నారు.
విధుల్లో చేరండని కేసీఆర్ అడిగినప్పుడు సమ్మె చేసి డిమాండ్లు సాధించుకుంటామని సీఎంను సవాలు చేసిన కార్మికులు ఇప్పుడు డ్యూటీలో చేరిపోవాలని తహతహలాడిపోతున్నారు. క్షమాపణ పత్రాలు రాసివ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నారనిపిస్తోంది. వీరు ఎంత బతిమాలినా విధుల్లో చేర్చుకోవడానికి కేసీఆర్ సిద్ధంగా లేడు. అసలు ఆర్టీసీయే అనవసరమన్నట్లుగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పటికిప్పుడు కార్మికులను కరుణించే పరిస్థితి లేదు. హైకోర్టు ఆయనకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం ప్రైవేటీకరణతో ఆర్టీసీ రూపురేఖలు మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. దీంతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు విలువ లేకుండా పోయింది. ప్రధానమైన విలీనం డిమాండ్‌ను ఏనాడో వదిలేసుకున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కాబట్టి మిగతా డిమాండ్లు కూడా గాలికి పోయినట్లే. ప్రధానమైన విషయం ఏమిటంటే…దాదాపు సగం మంది కార్మికులు ఇంటికెళ్లే పరిస్థితి ఏర్పడింది.
అంటే వీఆర్ఎస్ ఇచ్చి పంపించాలని కేసీఆర్ ఆలోచన. సగం రూట్లు ప్రైవేటీకరణ అయితే ఆర్టీసీలో అదనపు సిబ్బంది ఉన్నట్లే కదా. వారినేం చేసుకుంటారు? అందుకే వీఆర్ఎస్తో ఇంటికి పంపుతారు. 50 ఏళ్లు పైడిన వాళ్లను ఇంటికి పంపుతారని అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశముందని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే కార్మికులకు ఇంకా నష్టం కలుగుతుంది. ఈ విషయం కేసీఆర్ ఇదివరకే చెప్పాడు. ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే కార్మికులు డీలా పడ్డారు. ఇక సుప్రీం కోర్టుకు వెళ్లి ఏం సాధిస్తారు? సుదీర్ఘకాలం సాగిన సమ్మెతో ఆర్టీసీ కార్మికులు ఏం సాధించారయ్యా అంటే తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టిన ప్రైవేటీకరణను సాధించుకున్నారని చెప్పుకోవచ్చు.