అందరి కళ్లూ సాహో టీజర్ పైనే. ప్రభాస్ అభిమానులైతే.. ఒళ్లంతా కళ్లు చేసుకుని టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. బాహుబలి తరవాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి – అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. చిత్రబృందం కూడా ‘మాది హాలీవుడ్ రేంజ్ సినిమా’ అని ముందు నుంచీ గట్టిగా చెబుతూ వస్తోంది. బాహుబలితో పెరిగిన ప్రభాస్ రేంజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేస్తున్నారు. ఓ స్ట్రయిట్ హిందీ సినిమాకి ఏం చేయాలో.. అవన్నీ ఈసినిమా కోసం చేశారు. బడ్జెట్ కూడా 250 కోట్ల పైమాటే అని, యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని చిత్రబృందం చెబుతోంది. అసలు ఈ సినిమా స్టామినా ఎంతో, ఏ స్థాయిలో ఉండబోతోందో.. టీజర్ చెప్పేయడం ఖాయం.
ఇప్పటి వరకూ షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో రెండు టీజర్లు విడుదలయ్యాయి. వాటికొచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. కాకపోతే ఆ రెండూ మేకింగ్ వీడియోల్లా ఉన్నాయి గానీ, సాహో గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేకపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రేమిటి? అనే విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు ఈ టీజర్‌తో కథ, ప్రభాస్ పాత్ర రెండూ చూచాయిగా బయటపెట్టే అవకాశం ఉంది. 250 కోట్ల భారీ బడ్జెట్ సినిమాని రెండో సినిమా చేస్తున్న సుజిత్ అనే కుర్ర దర్శకుడు ఎంత వరకూ మోస్తాడు? అనే అనుమానం ప్రభాస్ అభిమానుల్లో ముందు నుంచీ ఉంది. సుజిత్ స్టామినా ఏమిటో కూడా ఈ టీజర్ బయట పెట్టడం ఖాయం. మేకింగ్, యాక్షన్, కంటెంట్ – ఇవి మూడూ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయా? లేదా? బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టే దమ్ము `సాహో`కి ఎంత ఉంది? – వీటిపై టీజర్ చూసి ఓ అంచనాకు రావొచ్చు. టీజర్ ఎలా ఉన్నా, సాహో ప్రీ రిలీజ్ బిజినెస్‌కు ఎలాంటి ఢోకా ఉండదన్నది మాత్రం వాస్తవం. కాకపోతే… టీజర్ బాగుంటే – బయ్యర్లు, ఫ్యాన్స్ ముందే పండగ చేసుకుంటారు. అంతే తేడా.