ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతుందా? పార్టీని వీడెందుకు మరో కీలక నేత నిర్ణయించుకున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడెందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ సన్నిహిత నేతగా ముద్రపడిన ఉదయభాను.. వైఎస్సార్ మరణానంతరం జగన్ తోనూ సన్నిహితంగానే మెదిలారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశించినా ఉదయభానుకు నిరాశే ఎదురైంది. దాంతో అప్పుడే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి కేవలం 15వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పార్టీ అధికారం కోల్పోయాక ఉదయభాను యాక్టివ్ గా కనిపించడం లేదు. పార్టీ మారాలనే నిర్ణయంతోనే వైసీపీ కార్యక్రమాల్లో ఉదయభాను యాక్టివ్ గా పాల్గొనడం లేదని నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. సామినేని ఉదయభానుకు మెగా ఫ్యామిలీతో రిలేషన్ ఉండటంతో.. జనసేనలో చేరే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.