విభిన్నమైన కథలు చేయాలని ప్రయత్నించే నటుడు సందీప్ కిషన్. కానీ ఆ ప్రయత్నాలేవీ కలిసిరావడం లేదు. సందీప్ కి మంచి విజయం దక్కి చాలా కాలమైయింది. ఆ మధ్య మైఖేల్ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. నిజానికి ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కూడా. కానీ కష్టానికి తగిన ఫలితం రాలేదు. హీరో రేసులో నిలబడాలంటే ఇప్పుడు తప్పకుండా ఒక విజయం సాధించి తీరాల్సిన సమయం ఇది. ఇలాంటి సందర్భంలో వస్తోంది సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’. గతంలో సందీప్ తో టైగర్ సినిమా తీసిన విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫాంటసీ అడ్వంచర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఇప్పుడు సందీప్ ఆశలన్నీ ఈ సినిమాపైనే వున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం నుంచి బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రామెసింగ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కథపై ఆసక్తిని పెంచితే.. మొదటి పాట ‘నిజమే నే చెబుతున్నా’జనాల్లోకి బాగానే వెళ్ళింది. ఇప్పుడు హమ్మా హమ్మా అనే పాటని వదిలారు. ఈ పాట కూడా రామ్ మిర్యాల వాయిస్ లో క్యాచిగా వుంది. ఫాంటసీ అడ్వంచర్ లాంటి కంటెంట్ ని ప్రేక్షకులు థియేటర్ లో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రకంగా సరైన సమయంలోనే వస్తున్న సినిమా ఇది. మరి ఈ సినిమాతోనైన సందీప్ టైమ్ మారుతుందో లేదో చూడాలి.