బిగ్ బాస్ 2 హౌస్ నుంచి బయటకు వచ్చిన తొలి హోస్ మేట్ సంజన. ఆమె ఎగ్జిట్ ఎవ్వరినీ ఆశ్చర్యపరచలేదు. సంజన వెళ్లిపోతుంటే.. సోషల్ మీడియాలో `నాగార్జున గారూ.. సంజనని ఎలిమినేట్ చేసి మంచి పని చేశారు` అంటూ సంబరాలు చేసుకున్నారు. సంజన ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిందో లేదో.. ఇలా మీడియా ముందు వాలిపోయింది. బిగ్ బాస్ నుంచి తొందరగానే బయటకు వచ్చేశానన్న అసంతృప్తితోనో, ఏమో.. బిగ్ బాస్ షో గురించి కొన్ని నెగిటీవ్ కామెంట్లు చేసింది. ఈ షో నుంచి తనకు ఒక్క పైసా కూడా రాలేదని, సెలబ్రెటీలు తనని చిన్న చూపు చూశారని, నాని హోస్ట్‌గా పనిచేయడని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా నెగిటీవ్ వార్తలకే బలం ఎక్కువ కాబట్టి సంజన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు.
అసలే బిగ్ బాస్ 2 క్రేజ్ అంతంత మాత్రంగానే ఉంది. సీజన్ 1తో పోలిస్తే.. బోరింగ్‌గా ఉందని, సెలబ్రెటీల వల్ల జోష్ రావడం లేదని టీవీ ప్రేక్షకులు విస్తుపోతున్నారు. నాని కాస్త కవర్ చేయడానికి చూస్తున్నా – ఎన్టీఆర్ చేసినప్పటి ఊపు ఇప్పుడు కనిపించడం లేదు. దీని తోడు సంజన కామెంట్లు కాస్త ఇరుకున పెట్టేవే. సంజన అనే కాదు… బిగ్ బాస్ నుంచి తొందరగా బయటకు వచ్చేసే వాళ్లు ఈ తరహా నెగిటీవ్ కామెంట్లే చేస్తుంటారు. ఓ విధంగా బిగ్ బాస్ 2కి ఇది కూడా ఓ ప్రచార ఆయుధమే అయ్యుంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ 2 గురించి ఎక్కడా నెగిటీవ్ గా మాట్లాడకూడదని – ఎంపిక సమయంలోనే ఓ ఎగ్రిమెంట్ చేయించుకుంటారు నిర్వాహకులు. దాన్ని అతిక్రమించడం కూడా ఓ విధంగా పబ్లిసిటీ ప్లానే కావొచ్చు. ఇలా నెగిటీవ్ కామెంట్ల వల్ల `బిగ్ బాస్ లో ఏదో్ జరుగుతోంది` అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలగడం ఖాయం. అలా జరిగితే… ఆటోమెటిగ్గా వ్యూవర్ షిప్ పెరుగుతుంది. ఇదంతా బిగ్ బాస్ నిర్వాహకుల ఎత్తుగడ కావొచ్చు. లేదంటే సంజన ఫస్ట్రేషన్ వల్ల బయటపడుతున్న నిజాలు కావొచ్చు. ఏదైనా బిగ్ బాస్‌కి మేలే.