లైంగిక వేధింపుల ఆరోపణలతో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బీజేపీలో చేరనున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరిక విషయమై ఏపీ బీజేపీ నేతలతో సంప్రదించకుండా తమిళనాడుకు చెందిన కమలనాథులతో చర్చిస్తే తన చేరికకు మార్గం సుగమం అవుతుందని.. ఆయన అటు వైపు నుంచి నరుక్కోస్తున్నారని రెండు రోజులుగా కథనాలు వస్తున్నాయి.
టీడీపీ మహిళా నాయకురాలిని లైంగికంగా వేధించడంతో ఆ పార్టీ ఆగ్రహానికి గురైన ఆదిమూలం..కూటమిలోని ఏదో ఒక పార్టీ గొడుగు కింద చేరాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ మనసు మార్చుకొని ఆయనను తిరిగి చేరదీసే పరిస్థితి లేదు. జనసేన కూడా ఆయన చేరికను తిరస్కరిస్తుందనేది ఓపెన్ సీక్రెట్. దాంతో బీజేపీలో చేరేందుకు ఆదిమూలం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ , ఆయన చేరికను కమలదళం కూడా నిరాకరించే అవకాశం ఎక్కువగా ఉంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్దీయేలో చంద్రబాబు కీలక పాత్ర వహిస్తున్న పరిస్థితుల్లో ఆదిమూలంను బీజేపీలో చేర్చడం అనుమానమే. పైగా..మహిళను వేధించిన నేతను టీడీపీ సస్పెండ్ చేస్తే బీజేపీ చేర్చుకుంది అన్న అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుంది. సో , ఎలా చూసినా ఆదిమూలం బీజేపీలో చేరడం అసాధ్యంగా కనిపిస్తోంది.