వంద శాతం మంత్రుల్ని మార్చాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆ మేరకు అందరినీ మానసికంగా సిద్ధం చేస్తున్నారు. మెజార్టీ మంత్రుల నుంచి ఎలాంటి అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కువ మందికి వ్యక్తిగతంగా బలం లేదు. కానీ కొద్ది మంది సీనియర్లు మాత్రం పార్టీకి మించి ఎదిగారు. ఆయా చోట్ల తామే పార్టీ అన్నట్లుగా ఉన్నారు. అక్కడ మంత్రులుగా ఉన్న వారే అసలు సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇద్దరు ముఖ్య నేతలు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరొకరు బొత్స సత్యనారాయణ.
కారణం ఏమైనా కానీ వీరిద్దరి పేర్లు చాలా రోజులుగా వివిధ కారణాలతో ప్రచారంలోకి వస్తున్నాయి. అందుకే వారిని రాష్ట్ర రాజకీయాలలో లేకుండా ఢిల్లీకి పంపాలని జగన్ నిర్ణయించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే ముందుగా మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు ఇవ్వడం తరవాత.. రాజ్యసభకు పంపి .. వారి వారి జిల్లాల్లో పట్టులేకుండా చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి వారికి పార్టీ పదవులు ఇచ్చినా చేసేదేమీ ఉండదు. ఇప్పుడు మంత్రులుగానే అప్పుడూ ఉండాల్సి ఉంటుంది. మంత్రిగా ఓ పదవి అయినా ఉంటుంది..పార్టీలో అయితే అదేమీ ఉండదు. అన్ని పనులు ప్రధాన సలహాదారే చేస్తూంటారు.
తమను నియంత్రించడానికే జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ వేస్తున్నారని తెలుసుకోలేనంత అమాయక రాజకీయ నేతలు కాదు బొత్స, పెద్దిరెడ్డి, రాజకీయంలో ఢక్కా మొక్కీలు తిన్నారు. కానీ జగన్ అంత కంటే ఎక్కువే రాటుదేలిపోయారు. ఇప్పుడు తాము పదవుల్లోనే ఉండేందుకు బొత్స, పెద్దిరెడ్డి చేయగలిగినదంతా చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక వేళ నిజంగానే వారిని పదవుల నుంచి దింపేస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి.. వారు ఎలాంటి రాజకీయంతో కౌంటర్ ఇస్తారన్నది ఇప్పుడు వైసీపీలోనే హాట్ టాపిక్ గామారింది. వారిద్దర్నీ కూడా పదవుల నుంచి తొలగిస్తే రాజకీయం రసరవత్తరంగా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.