వైఎస్ చనిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది చనిపోయారని వైసీపీ నాయకులు ప్రణాళిక ప్రకారం ప్రచారం చేశారు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ… ఈ మృతులు ఉన్నారు. వీరందర్నీ ఓదారుస్తానని జగన్మోహన్ రెడ్డి భారీ ర్యాలీలుగా వెళ్లేవారు. దాన్ని అడ్డుకున్నారని జగన్ పార్టీ పెట్టుకున్నారు. ఈ మధ్యలో రాష్ట్రం విడిపోవడం వంటివి జరిగాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర తెలంగాణలో ఆగిపోయింది. తెలంగాణలో చాలా జిల్లాల్లో ఇప్పటికీ వైఎస్ మృతి కారణంగా గుండె పగిలి చనిపోయినవారికి ఇంకా ఓదార్పు లభించలేదు.
షర్మిల నోట ఈ ప్రస్తావన వచ్చింది. వైఎస్ చనిపోయినప్పుడు తెలంగాణలోనూ వందల మంది చనిపోయారని పేర్కొన్నారు. ఈ మాటలతో చాలా మందికి ఓదార్పు యాత్ర గుర్తుకు వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ కోసం చనిపోయిన తెలంగాణ వారి అవసరం తనకు లేదన్నట్లుగా జగన్ వారిని పట్టించుకోలేదు. ఓదార్పు కొనసాగించలేదు. ఇప్పుడు… షర్మిల ఈ మిగిలిన పనిని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆమె ఆ మరణాల గురించి ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. పార్టీకి హైప్ సృష్టించి.. తనకు ఎంతో ఆదరణ ఉందని చూపించే ప్రయత్నాల్లో పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు షర్మిల.
పార్టీ ప్రకటన తర్వాత పాదయాత్ర చేయనున్నారు. వైఎస్ఆర్ రాజన్నరాజ్యమే షర్మిల లక్ష్యం కాబట్టి పెద్ద ఎత్తున .. ఆనాడు లెక్క వేసిన మరణాలన్నింటికీ నేడు ఓదార్పు చేస్తే మరింత వ్యూహాత్మకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. షర్మిల పార్టీ వ్యూహాకర్తలు ఏమనుకుంటున్నారో కానీ..,ఇప్పటి వరకూ షర్మిల పార్టీ కసరత్తును చేస్తున్న వైనం చూస్తే… పాదయాత్రలో ఓదార్పు యాత్ర ఖాయమన్న చర్చ జరుగుతోంది.