ఓ వైపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు దిగ్బంధనం కొనసాగుతోంది. అక్కడ ఉన్న రైతులు 90 శాతం పంజాబ్, హర్యానాకు చెందిన వారే. సిక్కులే. వీరితో కేంద్ర ప్రభుత్వం ఎంత చర్చించినా.. సమస్య పరిష్కారం కావడం లేదు. రైతులు చట్టాల ఉపసంహరణకే పట్టుబడుతున్నారు. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందన్న ఉద్దేశంతో అసలు తాము చర్చకు కూడా రాబోమని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. వారి ఉద్యమాన్ని అణిచివేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కొత్తగా బుజ్జగింపులకు ప్రధానమంత్రి మోడీ రంగంలోకి దిగారు. ఆయన స్టైల్ ఆఫ్ కార్యాచరణ వేరేగా ఉంటుంది. దాని ప్రకారం..ఆయన ఆదివారం నుంచే రంగంలోకి దిగారు.
అంతకు ముందు రోజు రైతులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం.. హఠాత్తుగా.. ఢిల్లీలోని గురుద్వారా రకాబగంజ్ కు వెళ్లారు. అది కూడా అధికారిక షెడ్యూల్లో లేదు. ఆయన వెళ్తున్నట్లుగా ఎవరికీ తెలియదు. ఒక్క పీఆర్ టీంకు మాత్రమే తెలుసు. ఆయన పర్యటన దృశ్యాల్ని చిత్రీకరించడానికి ఆయన పీఆర్ టీం ఏర్పాట్లు చేసుకుంది. ఉదయాన్నే మంచుకురుస్తుండగా, ఒక సామాన్య వ్యక్తి మాదిరిగా ప్రధాని మోదీ గురుద్వారా చేరుకున్నారు. తరువాత ప్రధాని తన గురుద్వారా సందర్శనకు సంబంధించిన ఫొటో షేర్ చేశారు. గురుద్వారా చరిత్రను చెప్పారు. సిక్కుల మత గురువును పొగడ్తలతో ముంచెత్తారు.
మోదీ పర్యటనకు.. రైతుల ఉద్యమానికి నేరుగా సంబంధం లేకపోయినా… నాలుగు రోజుల్లో జరగనున్న రైతులతో చర్చల సమయంలో.., ఇది ఎమోషనల్ టచ్ ఇస్తుందని.. బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేసి ఉంటారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పంజాబ్ రైతులు… తమ జీవనోపాధిని.. కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. కార్పొరేట్ సంస్థలు కూడా.. మద్దతు ధరతోనే కొనుగోలు చేసేలా..చట్టంలో మార్పులు చేయాలని వారు కోరుతున్నారు. అలా కుదరకపోతే..అసలు చట్టాల్ని రద్దు చేయాలంటున్నారు. కానీ చట్టాల్ని రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం అంటోంది. అలాగే మద్దతు ధరతో కార్పొరేట్ కంపెనీలు కొనుగోలు చేసేలా చట్టంలో కూడామార్పులు చేయలేమని అంటోంది. దీంతో సమస్య పీటముడి పడిపోయింది.