త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో సిక్స్ కొట్టబోతున్నారా..? మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆరు గ్యారంటీలతో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించిన కాంగ్రెస్ .. ఇప్పుడు అదే ఆరు స్ట్రాటజీతో ఆ పార్టీని చెడుగుడు ఆడేస్తోంది.
గతంలో పార్టీ ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించి ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూసిన కేసీఆర్ , బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి కసిదీరా దెబ్బకొట్టే ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు అదను చూసి చేరికలను ప్లాన్ చేస్తోన్నా రేవంత్.. కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరుతోనే కేసీఆర్ ను మరింత వీక్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆరుగురు చొప్పున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకొని బీఆర్ఎస్ లో అలజడి రేపిన రేవంత్.. మరో ఆరుగురుని జాయిన్ చేసుకొనే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్వహించిన నిర్వహించిన గ్రేటర్ మీటింగ్ కు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కలకలం రేపింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి,కూత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద,కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ డుమ్మా కొట్టారు.వీరంతా వ్యక్తిగత పనులు ఉండటంతోనే ఈ మీటింగ్ కు డుమ్మా కొట్టారా..? లేక పార్టీ మారాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కు గైర్హాజరు అయ్యారా…? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రేవంత్ మరో సిక్స్ కొట్టబోతున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయంశం అవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.