వైసీపీ నేతలు ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ సినిమా నటులను దువ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ వాడుకుని .. వాళ్ల జీవితాల్ని రిస్క్‌లో పడేయడమే జరిగింది కానీ వారికి మేలు చేసింది లేదు. 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోహన్ బాబు, జయసుధ, జీవితారాజశేఖర్, తనీష్, కృష్ణుడు వీరంతా ఒక్కొక్కరిగా పార్టీకి దూరమయ్యారు. స్వయానా బంధువు అయిన మోహన్ బాబు అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేనే లేదు. జీవితారాజశేఖర్ ఏకంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక టిక్కెట్ దగ్గర్నుంచి రాజ్యసభ వరకూ అన్ని పదవులూ ఆశ చూపిన అలీకి ఇప్పటికీ ఏమీ దక్కలేదు. చివరికి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లనే కాదు వారి కుటుంబాలను కూడా బండ బూతులు తిట్టి తన జగన్ భక్తికి అంతు లేదని నిరూపించుకున్న పోసానికీ చాన్స్ రాలేదు. రేపు ప్రభుత్వం మారితే .. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే వీరుబలైపోతారు. ఇక ఫృథ్వి విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చాలా మంది అలాంటి తప్పులు చేసినా ఫృధ్వీని మాత్రం బలి చేసేశారు.
వాడుకుని వదిలేయడమే కాకుండా ఇండస్ట్రీని జగన్ ఆడుకున్నట్లుగా ఎవరూ ఆడుకోలేదు. చివరికి చిరంజీవి దండం పెట్టించుకున్నారు. ధియేటర్లు, టిక్కెట్లనూ వదల్లేదు. ఆ పార్టీని ఇక ఎవరైనా అభిమానించలేరని టాలీవుడ్‌లోని కొన్ని వర్గాలు చెబుతూ ఉంటాయి. చిన్నా చితకా ఆర్టిస్టులు వైసీపీకి ప్రచారం చేసి బతుకు దెరువు పోగొట్టుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు . అందుకే వాడుకుని మోసం చేయబోమని పదవులు ఇస్తామని చెబుతున్నారు. ఒకరిద్దరికి పదవులు ఇస్తారంటున్నారు. అయినా వైసీపీని ఇంకా నమ్మే టాలీవుడ్ నటులు ఉంటారా అన్నది సందేహమే.