సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది. గాంధీ భవన్ లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై.. కీలక అంశాలపై ఓ స్పష్టతకు వచ్చారు. లోక్సభ ఎన్నికలు ఓ నెల ముందే వస్తాయని స్పష్టత వస్తున్నందున.. ఇంచార్జుల్ని ప్రకటించారు. చేవెళ్లతో పాటు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతల్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారు. మిగతా మంత్రులు తమ పరిధిలో నియోజకవర్గాలకు బాధ్యత వహిస్తారు.
అలాగే నామినేటెడ్ పదవులపైనా చర్చ జరిగింది. పార్టీ కోసం పని చేసిన వారందరికీ .. మేలు జరగాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. కింది స్థాయిలో సంక్షేమ పథకాల నుంచి వాటిని అమలు చేయాలన్నారు. ద్వితీయ శ్రేణి నేతలకు నామినేటెడ్ ప దవులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆలస్యం ఉండదని పార్టీ కోసం కష్టపడిన వారందరికీ మేలు జరుగుతుందన్న సంకేతాలు పంపారు. అదే సమయంలో నియోజకవర్గ ఇంచార్జులుగా ఓడిపోయిన చోట అభ్యర్థులే కొనసాగుతారని.. అనధికార ఎమ్మెల్యేలుగా వారికే ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది కాదు.. మనం బీఫామ్ ఇచ్చిన నాయకుడి నుంచే పథకాలు అందాలి.. గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు.
గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. ఆ కారణంతో ఇప్పుడు మెదక్ నుంచి సోనియాను పోటీ చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతూ ఉండవచ్చు. కానీ సోనియా గాంధీ అంగీకరిస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. ఒక వేళ ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే..ఆమె పోటీ చేసే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి పార్టీ కోసం పని చేసిన వారికి నెల రోజుల్లోనే ఏదో ఓ పదవి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.