ఇకపై తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కొంత సమయం కేటాయిస్తా… ఇదే మాటను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు. ఎప్పుడో ఆయనకి తీరిక ఉన్నప్పుడు ఓసారి హైదరాబాద్ రావడం, తెలంగాణ నేతలకు ఈ మాట చెప్పి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. టీ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. త్వరలో నిర్వహించనున్న మహానాడుతోపాటు, రాష్ట్రంలో జరగబోతున్న పంచాయతీ ఎన్నికలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో చర్చించారు.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారట! రేవంత్ రెడ్డి లాంటి నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయిన తరువాత పార్టీలో చురుకైన పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉందనీ, కానీ నాయకులు చొరవ తీసుకోవడం లేదంటూ అభిప్రాయపడ్డారు. ఇకపై తాను టీ టీడీపీకి సమయం కేటాయిస్తారని చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణ పార్టీకి ప్రత్యేకంగా సమయం కేటాయించేంత తీరిక చంద్రబాబుకు ఇప్పుడు ఉందా..? ఎందుకంటే, ఏపీ రాజకీయాలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. అయినా, ఎప్పటికప్పుడు టి. నేతలతో చంద్రబాబు భేటీ అయి, చర్చినంత మాత్రాన తెలంగాణలో టీడీపీ కొత్తగా బలం పుంజుకుంటుందా అనేదీ ప్రశ్నే! ముందుగా తెలంగాణలో తెలుగుదేశం ఇమేజ్ ను మార్చాల్సిన ప్రయత్నం స్థానికంగా జరగాలి.
తెలంగాణ ఉద్యమం తరువాత తెలుగుదేశం అనేది ఆంధ్రుల పార్టీ అనే బలమైన ముద్ర బాగా పడిపోయింది. దాన్నుంచి బయట పడేందుకు రాష్ట్ర నేతలు కూడా ప్రయత్నించడం లేదు. దాన్నొక సమస్యగా చూస్తూన్నట్టూ లేదు. రొటీన్ పార్టీ కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప… ప్రజల్లో టీడీపీపై భరోసా కలిగించేందుకు కావాల్సిన చర్యలేవీ చెపట్టలేదనే చెప్పాలి. నిజానికి, తెలంగాణలో ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో టీడీపీకి అభిమానులు ఉన్నారు. అయితే, వారిని కలుపుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం జరగలేదు. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. కానీ, తెలంగాణలోని ఒక రాజకీయ పార్టీగా, ఈ రాష్ట్రానికి స్పష్టమైన విజన్ ప్రకటించిన దాఖలాలు లేవు. కాబట్టి, ముందుగా తెలంగాణలో టీడీపీపై ప్రజల్లో ఉన్న ఒక ఇమేజ్ ను మార్చాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణమైన కార్యాచరణపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ విషయంలో పార్టీ స్థానిక నాయకత్వమే కొంత చొరవ చూపించాలి.