దేశానికి ఇప్పుడు కావల్సింది విద్యాలయాలు, గుళ్లూ, గోపురాలూ కాదు. ఆసుపత్రులు. కరోనా వైరస్ మహమ్మారిని తిరిమేయాలంటే వైద్యులే దేవుళ్లుగా మారాలి. ప్రతీ వీధిలోనూ ఓ ఆసుపత్రి వెలగాలి. కరోనా ఈ స్థాయిలోనే విజృంభిస్తే… ఇప్పుడున్న ఆసుపత్రులేవీ బాధులుల్ని ఆదుకోలేవు. అలాగని ఇప్పటికిప్పుడు కొత్తగా ఆసుపత్రుల్ని నిర్మించుకునేంత సమయమూ లేదు. అందుకే ప్రభుత్వం రకరకాల ఆలోచనలు చేస్తోంది. రైల్వే బోగీల్ని ఐసొలేషన్ వార్డులుగా మార్చుకోవడం అనేది మంచి ఆలోచన. ఇప్పటికే రైళ్లు బంద్ అయ్యాయి. ప్రతీ రైల్వే స్టేషన్లోనూ రైళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. అవన్నీ ఐసొలేషన్ వార్డులుగా మారిస్తే… ఆసుపత్రుల కొరత ఎంతో కొంత తీరుతుంది. కమల్‌హాసన్ లాంటి వాళ్లు `మా ఇంటినే ఆసుపత్రిగా మార్చుకోండి` అంటూ పెద్ద మనసు చూపించారు. లంకంత ఇళ్లుండే బడా నాయకులు, స్టార్లూ.. ఈ విపత్కర సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందే. తమ ధాతృత్వాన్ని నిరూపించుకోవాల్సిందే.
ఇక స్టూడియోల్ని కూడా ఆసుపత్రులుగానూ, ఐసొలేషన్ వార్డులుగానూ మార్చుకుంటే ఈ ఆపద సమయంలో అక్కరకు వస్తాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఎక్కడికక్కడ షూటింగులు ఆగిపోయాయి. స్టూడియోలన్నీ ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌నే తీసుకోండి. అన్నపూర్ణ, అన్నపూర్ణ ఏడు ఎకరాలు, సారధి స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీ, రామానాయుడు స్టూడియో, నానక్ రామా స్టూడియో… ఇలా సినిమా షూటింగులకు చాలా వేదికలున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అక్కడ కనీసం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు కూడా జరగడం లేదు. ఈ నేపథ్యంలో వాటిని ఐసొలేషన్ వార్డులుగా మార్చుకుంటే ప్రభుత్వానికి ఓ వెసులుబాటు కలుగుతుంది. సినీ స్టూడియోలన్నీ దాదాపుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోనే నిర్మించినవే. అంటే.. అది ప్రజల సొమ్మే. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ప్రజా శ్రేయస్సు కోసం తాత్కాలికంగా ప్రభుత్వానికి అప్పజెప్పడం స్టూడియో అధినేతల బాధ్యత కూడా.