తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరిని ఈడీ రేపో మాపో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బ్యాంకుల కన్సార్టియం ఫిర్యాదు చేయడంతో … ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు… దాడులు చేసి.. రూ. 5700 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని… వివరణ ఇచ్చేందుకు తమ ఎదుట హాజరు కావాలని సమన్లు కూడా జారీ చేశారు. ప్రశ్నించిన తర్వాత సుజనా చౌదరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. బహుశా మొదటి సారి విచారణలో అరెస్ట్ చేయకపోయినా.. వచ్చే రెండు వారాల్లో .. అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప.. అరెస్ట్ ఖాయమని చెబుతున్నాయి.
సుజనా చౌదరి కంపెనీలపై.. ఆరోపణలు ఇప్పటివి కావు. చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్న ఓ పత్రికలోనే.. సుజనా చౌదరి అక్రమాలకు పాల్పడ్డారని పదేళ్ల కిందటే.. వరుస కథనాలు ప్రచురించారు. అప్పట్లోనే ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నదే ఆసక్తికరంగా మారింది. నిన్న సుజనా కంపెనీ విడుదల చేసిన ప్రెస్మీట్లో కూడా.. పదేళ్ల నాటి కేసులో.. సోదాలకు వచ్చారని.. వారికి కావాల్సిన పత్రాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అంటే.. సుజనా అక్రమాలు అప్పటి నుంచి ఉన్నాయన్నమాట. సుజనా చౌదరి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తన కంపెనీలపై.. ఈడీ చర్యలు తీసుకోకుండా.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రూ.5700 కోట్లు అంటే.. చాలా పెద్ద మొత్తం. విజయ్ మాల్యా, నిరవ్ మోడీలు చేసిన స్కాములంత పెద్దవి. మరి ఈ విషయంలో.. సుజనా చౌదరి ఇంత కాలం.. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి చర్యలను ఎదుర్కోకపోవడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
ఇంత కాలం సుజనా చౌదరిని కేంద్రం ఎందుకు ఉపేక్షించిందన్నది తేలాల్సి ఉంది.సుజనా చౌదరి ఎంపీ కాబట్టి… ఆయన చేసిన అక్రమాలపై… ఈడీ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.. ఏ బ్యాంకు నుంచి ఎంత రుణం తీసుకున్నారు.. ? ఎంత ఎగ్గొట్టారు..? ఆయా బ్యాంకులకు తనఖాగా ఏ ఆస్తులు పెట్టుకున్నాయి..? తనఖాలు పెట్టుకోకుండా.. లోన్లు ఇస్తే.. ఎలా ఇచ్చారు..? అన్న విషయాలపై ఈడీ ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సి ఉంది. నిరమ్ మోదీ, విజయ్ మాల్యా.. బ్యాంకుల్ని ఎలా మోసగించాలో..స్పష్టంగా బయటకు వచ్చంది. అదే తరహాలో సుజనా లీలలనూ… బయటపెట్టాల్సి ఉంది. తప్పు ఎవరు చేశారు..? సుజనా ఇంత కాలం ఎలా తప్పించుకున్నారో.. ప్రజలకు తెలియాల్సి ఉంది.