చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలోనూ చిరు ఓ క్లారిటీతో ఉన్నారు. ఆయన్ని ఈమధ్య లూసీఫర్ అనే మలయాళ చిత్రం ఆకట్టుకుంది. మోహన్ లాల్ నటించిన చిత్రమిది. ఫృథ్వీరాజ్ కీలక పాత్ర పోషించాడు. మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరు, ఫృథ్వీరాజ్గా చరణ్ కనిపించాలని ఆలోచన. అలా చేస్తే.. మెగా మల్టీస్టారర్ అవుతుంది. ఎలాగూ కొరటాల శివ సినిమాలో చిరు, చరణ్లని కలిసి చూó అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. కనీసం లూసీఫర్ తో అయినా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారు.
ఈ సినిమాకి వినాయక్ దర్శకుడైతే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నాడు. చిరు – వినాయక్లది మంచి కాంబో. పైగా చిరుకి అచ్చొచ్చిన దర్శకుడు వినాయక్. తనపై చిరుకి చాలా నమ్మకం. అయితే చరణ్ మాత్రం ఓ యంగ్ డైరెక్టర్ చేతిలో ఈ ప్రాజెక్టు పెట్టాలని భావిస్తున్నాడు. వాళ్లయితే కథని ఇంకాస్త కొత్తగా ఆలోచిస్తారని, మేకింగూ, టేకింగూ వేరుగా ఉంటాయని నమ్ముతున్నాడు. సుజిత్ కి ఈ సినిమా అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు. లూసీఫర్ మేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. సుజిత్ కూడా స్టైలీష్ గానే సినిమాలు తీస్తుంటాడు. తనైతే అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తవుతుందని చరణ్ నమ్మకం. అలా.. ఈ రీమేక్ విషయంలో చిరు – చరణ్ ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. దర్శకుడిగా ఇద్దరి దగ్గరా ఓ ఛాయిస్ ఉంది. చివరికి ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.