రెండ్రోజుల్లో వరుసగా.. రెండు సినిమాలపై, కాపీ ఆరోపణలు బాణాల్లా దూసుకొచ్చాయి. ఒకటి.. ఆచార్య, రెండోది పుష్ష. ఆచార్య కథ నాదే అంటూ ఓ రచయిత గళం విప్పాడు. టీవీ ఛానళ్లలో డిబేట్లూ, ఫిల్మ్‌నగర్ లో పంచాయితీలూ మొదలైపోయాయి. వీటిపై మైత్రీ మూవీస్ స్పందించింది. `నిరాధారమైన ఆరోపణలు` అంటూ కొట్టి పారేసింది. `ఆ కథ బాలేదు. ఆ విషయం మేం ముందే చెప్పేశాం. బాగోలేని కథ మేమేం చేసుకుంటాం` అంటూ.. ఆ రచయిత గాలి తీసేసింది. మరోవైపు కొరటాల శివ కూడా… ఆరోపణలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
మరి.. సుకుమార్ ఎప్పుడు స్పందిస్తాడో. ఎందుకంటే.. సుక్కు సినిమా `పుష్ష`పైనా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. తన కథ `తమిళ కూలీ`ని సుకుమార్ కాపీ కొట్టాడన్నది ఆరోపణ. సుకుమార్‌పై కాపీ ఆరోపణలు చేసిన వ్యక్తి సామన్య రచయితేం కాదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత. తమిళ కూలీ కథ చదివినవాళ్లకెవరికైనా `పుష్ష` ఈ కథేనేమో అనిపించకమానదు. ఎందుకంటే రెండు కథల నేపథ్యాలూ ఒక్కటే. రెండింటిలోనూ.. ముఖ్య పాత్రధారి లారీ డ్రైవరే. రెండూ ఎర్ర చందనం నేపథ్యంలో సాగే కథలే. సమస్య జటిలం కాక మునుపే… కొరటాల శివ బృందం ధీటుగా స్పందించింది. సుకుమార్ కూడా.. ఇలానే తన అభిప్రాయం వ్యక్తం చేస్తాడా? లేదంటే – లైట్ తీసుకుంటాడా? `పుష్ష` పెద్ద సినిమా. పైగా ఇది కూడా మైత్రీ మూవీస్ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. `ఆచార్య` వ్యవహారంలో మైత్రీ గట్టిగానే స్పందించింది. కాబట్టి.. పుష్ఫ విషయంలోనూ.. ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువ.