పుష్ప తరవాత… విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా అంటూ.. ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చేసింది. కాకపోతే.. ఆ తరవాత చాలా సమీకరణాలు మారాయి. పుష్ప కాస్త 2 భాగాలైంది. పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో, 2ని ఇంకా బాగా చేయాలన్న కసి పెరిగింది. దాంతో… పుష్ప 2 ఆలస్యమవుతూ వస్తోంది. సుకుమార్‌కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా కొత్త సినిమాలపై సంతకాలు పెడుతూ పోతున్నాడు. ఖుషి తరవాత రెండు సినిమాలున్నాయి. ఒకటి… పరశురామ్ దర్శకత్వంలో, మరోటి గౌతమ్ తిన్ననూరితో. ఇవి రెండూ అయ్యాక పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. మరోవైపు సుకుమార్ – రామ్ చరణ్ కాంబో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని టాక్. దాంతో.. విజయ్‌తో సుక్కు సినిమా ఉండకపోవొచ్చని అంటున్నారు. దీనిపై వార్తా కథనాలు కూడా వస్తున్నాయి.
కానీ విజయ్ సన్నిహితులు మాత్రం… ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. `సుక్కుతో విజయ్ సినిమా ఉంది..` అంటూ గంటాపథంగా చెబుతున్నారు. సుకుమార్ పుష్ప 2తో బిజీగా ఉన్నా, అప్పుడప్పుడూ విజయ్ కథ గురించి కూడా డిస్కర్షన్లు చేస్తున్నాడని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించి సుకుమార్, విజయ్ దేవరకొండలు అడ్వాన్సులు కూడా తీసుకొన్నారు. రామ్ చరణ్‌తో సుకుమార్ సినిమా ఉంది. ఈ విషయంలో డౌటు లేదు. కాకపోతే… చరణ్ డేట్లు దొరకడానికి కూడా టైమ్ పడుతుంది. పుష్ప 2 అవ్వగానే.. విజయ్ తో సినిమా పూర్తి చేసి, అప్పుడు చరణ్ సినిమాని పట్టాలెక్కించాలన్నది సుక్కు ప్లాన్. విజయ్ కూడా గౌతమ్ తిన్ననూరి, పరశురామ్ కథల్ని సమాంతరంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇవి కాకుండా విజయ్ కొత్త కథలేం వినడం లేదు. అడ్వాన్సులూ తీసుకోవడం లేదు. దానికి కారణం.. ఒక్కటే. సుక్కు పుష్ప 2 పూర్తి చేసే సమయానికి… తనకి అందుబాటులో ఉండడం. సో….ఈ కాంబో ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టాలెక్కడం ఖాయం.