సన్ రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్ మధ్య ఏర్పడిన వివాదాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునేందుకు ఆంధ్రా క్రికెట్ అసిసోయేషన్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఏడాది ఐపీఎల్ నాటికి అయినా సన్ రైజర్స్ టీం తమ హోం స్టేడియంగా విశాఖను ఎంచుకునేలా ఆఫర్లు ఇస్తున్నారు.
ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య ఏర్పడిన వివాదం అంతకంతకూ ముదురుతోంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తమను వేధిస్తున్న సంగతిని ఎస్ఆర్హెచ్ బయటపెట్టడం వారి ఈగో దెబ్బతిన్నది. అవి అవాస్తవ ఆరోపణలు అని ఓ పెద్ద లేఖ విడుదల చేశారు. ఈ అంశంపై సానుకూలంగా పరిష్కరించుకునేందుకు సిద్దమని చెబుతున్నారు కానీ.. అలాంటి అవకాశాలు మాత్రం రెండు వైపులా స్పందనలతో తగ్గిపోయినట్లు కనిపిస్తోది.
మరోవైపు ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కవిత మద్దతుతోనే ఆయనకు ఆ పదవి లభించిందని అందరికీ తెలుసు. ఈ క్రమంలో రేవంత్ తీసుకునే చర్యలపై ఆసక్తి ఏర్పడింది.
ఐపీఎల్ టీములు పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. ఏ స్టేడియం అన్నది వారి ఇష్టం. హైదరాబాద్ స్టేడియాన్ని ఒక్కో మ్యాచ్ కోసం కోటిన్నర అద్దె కట్టి తీసుకుంటారు. అందుకు కొన్ని టిక్కెట్లు ఇతర పాసులు ఇస్తారు. ఇప్పుడు విశాఖ స్టేడియాన్ని అంత కంటే తక్కువ అద్దెకు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. సన్ రైజర్స్ టీం .. ఈ ప్రయోజనాలు లాభదాయకంగా ఉంటాయనుకుంటే వచ్చే ఏడాదికైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.