నరేంద్రమోడీ ప్రభుత్వానికి.. యూపీఏ-2 పరిస్థితులు ఎదురవుతున్నాయని.. చాలా రోజులుగా విశ్లేషణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సహా అనేక అంశాల్లో.. అచ్చంగా మన్మోహన్ సింగ్ సర్కారు గత ఎన్నికల ముందు ఎదుర్కొన్న పరస్థితే ఎదుర్కొంటోంది. తాజాగా.. అప్పట్లో టూజీ స్కాంలా.. ఇప్పుడు.. రాఫెల్ స్కాం.. కోర్టు ముందుకు రాబోతోంది. టూజీ స్కాంను కాగ్ బయటపెట్టింది. దానిపై కోర్టులో పిటిషన్లు వేశారు. కోర్టు విచారణ చేసింది. లక్షల కోట్ల స్కామంటూ మీడియా హోరెత్తిపోయింది. చివరికి స్కామేమీ లేదని కొన్నాళ్ల క్రితం కోర్టు తీర్పు చెప్పింది. లక్షల కోట్లు దోచేశారని హడావుడి చేసిన బీజేపీ.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నా.. అప్పీల్ కు కూడా వెళ్లలేదు.
ఇప్పుడు అలాంటి టూజీ స్కాం తరహాలోనే… రాఫెల్ స్కాంపై సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తోంది. మోదీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టిన వివాదాస్పదమైన రాఫెల్ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యం విచారణను సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. భారత్ – ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన ఒప్పందం.. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ఖరారు చేసుకున్న యుద్ధ విమానాల ధరాల్లో వ్యత్యాస వివరాలను సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ వినీత్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేశారు. డసౌ సంస్థ.. రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను కూడా బయటపెట్టాలనేది ఆయన డిమాండ్. గతంలో రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఇదివరకే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి రేపు విచారించనున్నారు.రాఫెల్ ఒప్పందం రూ. 40వేల కోట్ల కుంభకోణమంటూ విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వరంగం సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్ను పక్కనపెట్టి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌ను రాఫెల్ డీల్‌లో భాగస్వామిగా చేసేందుకు మోదీ సర్కార్ ఫ్రాన్స్‌పై ఒత్తిడి తెచ్చిందంటూ విమర్శించాయి.
ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టే అవకాశం ఉంది. రంజన్ గగొయ్ రాఫెల్ స్కాంపై దర్యాప్తునకు ఆదేశిస్తే.. మాత్రం.. ఇదో రాజకీయ సంచలనం కావడం ఖాయమే. అదే జరిగితే.. మోడీ ప్రభుత్వానికి ఇదో టూజీలా మారి.. అంతిమంగా… యూపీఏ -2 పరిస్థితి.. ఎన్డీఏ -1కే వచ్చే అవకాశం ఉంది.