మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ.. సమానత్వం పేరుతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు… కొంత మంది నుంచి వచ్చిన మొదటి ప్రశ్న… మసీదుల్లోకి కూడా ఆడవారికి ప్రవేశం కల్పించేలా.. ఆదేశాలిస్తారా..? అనేదే. ఇప్పుడా ప్రశ్నకు సుప్రీంకోర్టు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇలా ప్రవేశం కల్పించాలంటూ.. దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
స్పందన తెలియచేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బరిమల ఆలయం కేసులో తీర్పు ఇచ్చినందువల్లే ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించినట్లు జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
ముస్లిం సంప్రదాయాల ప్రకారం..వారికి మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి ఉండదు. కులం, మతం, వర్గం, ప్రాంతం, లింగం ఆధారంగా ఏ పౌరుడిపైనా వివక్ష చూపించడం సరికాదని పుణెకు చెందిన దంపతులు పిటిషన్ వేశారు.మసీదుల్లోకి ముస్లిం మహిళలు రాకుండా ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని వారు కోరుతున్నారు. విచారణ సందర్భంగా..కెనడా, మక్కాల్లో మసీదుల్లోకి ముస్లింలను అనుమతిస్తున్నారని..పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.
కేరళలోని అయ్యప్ప ఆలయం శబరిమలలోకి అన్ని వయసు మహిళలకు అనుమతి కల్పిస్తూ గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే.. హిందూ విశ్వాసాలను దెబ్బతీసేలా కోర్టు తీర్పు ఉందన్న ఉద్దేశంతో… హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. కేరళలో కొన్ని రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తుల విశ్వాసం ప్రకారం… మహిళలు.. ఓ వయసు వరకు ఆలయంలోకి రారు. కానీ సుప్రీంతీర్పుతో భక్తి లేకపోయినా కొంత మంది ఆలయ ప్రవేశం చేశారు. ఇప్పుడు అలాంటి వివాదమే.. మసీదుల విషయంలోనూ వచ్చే ప్రమాదం ఏర్పడింది. మత విశ్వాసాల విషయంలో.. భక్తుల మనోభావాలను గౌరవించాలి కానీ..కోర్టులు జోక్యం చేసుకోకూడదన్న వాదన…చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. కానీ సమానత్వం పేరుతో దాఖలవుతున్న పిటిషన్లతో కోర్టులు తీర్పులు చెప్పక తప్పడం లేదు.