కమల వికాసం మొదలైపోయింది. సూరత్ లో బీజేపీ అభ్యర్థి గెలుపుతో మొదలైన ఈ హవా 400సీట్లకు చేరకుంటుందని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజయం అంటూ కాంగ్రెస్ విరుచుకపడుతుంటే, నామినేషన్ తిరస్కరణకు గురైన కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీలో చేరబోతున్నారు.
అసలేంటి ఈ సూరత్ గొడవ?
సూరత్ ఎన్నిక సందర్భంగా బీజేపీ ముఖేష్ దలాల్ కు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నీలేష్ కుంభానికి టికెట్ ఇవ్వగా, వీరితో పాటు పలువురు ఇండిపెండెంట్లు ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే, నామినేషన్ల గడువు ముగియగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ పై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఆయన పేర్కొన్న అఫిడవిట్ తో పాటు అభ్యర్థిత్వాన్ని బలపర్చే సంతకాలు ఒరిజినల్ కావని ఫిర్యాదు చేయగా, ఎన్నికల అధికారి నామినేషన్ ను తిరస్కరించారు. ఈలోగా ఇండిపెండెంట్లు అంతా నామినేషన్ వెనక్కి తీసుకోవటంతో బీజేపీ అభ్యర్థిని గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
బీజేపీ గూటికి కాంగ్రెస్ అభ్యర్థి?
అయితే, బీజేపీ కావాలనే అనైతికంగా కుట్ర చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ, కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, ఎన్నిక ప్రకటన పూర్తికాగానే, కాంగ్రెస్ అభ్యర్థి తన ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. ఒకట్రెండు రోజుల్లో బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో కాంగ్రెస్ మద్ధతుదారులంతా వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అంటూ నీలేష్ ఇంటి ముందు ధర్నాకు దిగటంతో ఉద్రికత్త మొదలైంది.
ఇప్పటికే కోర్టు తలుపు తట్టామని, ఇలాంటివి ప్రజాస్వామ్యానికి మంచివి కావని కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కావాలనే కుట్రలో భాగంగానే ఇదంతా చేశారని, 400సీట్లు గెలుస్తామన్న మోడీ… ఇలాగేనా గెలిచేది అంటూ మండిపడుతోంది.