“రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి తెదేపా కోటాలో రాజ్యసభ సీటు కేటాయించింది కనుక ఇకనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ మంజూరు చేస్తారా?” రాష్ట్ర ప్రజలందరి మనసులో ఇదే ప్రశ్న మెదులుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ ఒప్పందం మీదే ఆయనకి రాజ్యసభ సీటు కేటాయించారనే ఊహాగానాలు, అనుమానాలు వినిపిస్తున్నాయి కూడా. ఒకవేళ అదే నిజమైతే త్వరలోనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నట్లు సురేష్ ప్రభు నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. కానీ రెండేళ్ళుగా ఏవో కుంటిసాకులు చెపుతూ రోజులు దొర్లించేసిన ఆయన, ఇప్పుడు ఈ కారణంగా ఏపికి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినట్లయితే, ఓడిశా రాష్ట్రం అందుకు తీవ్ర అభ్యంతరం చెప్పవచ్చు. ఆ కారణంగా ఆయన విమర్శలు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. రాష్ట్రానికి రైల్వే రైల్వే జోన్ మంజూరు చేయదలిస్తే గత రెండేళ్ళలో అనేక మంచి సందర్భాలు వచ్చేయి కానీ మంజూరు చేయలేదు. కనుక ఇప్పుడు కూడా అవకాశం లేదనే భావించవలసి ఉంటుంది. కనీసం ఇప్పుడు కూడా రైల్వే జోన్ మంజూరు చేయకపోతే, కేంద్ర ప్రభుత్వం తమని మళ్ళీ మోసం చేసిందని రాష్ట్ర ప్రజలు భావిస్తే అది వారి తప్పు కాదు. కనుక తెదేపా ఇచ్చిన రాజ్యసభ సీటు తీసుకొని రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈవిషయంలో రాష్ట్రానికి బాకీ పడినట్లే భావించవచ్చు.