ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు… తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కలిసిరాలేదు. ఘోరపరాజయం తప్పలేదు. గెలిచిన ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలైనా పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ బలంగా నిలబడతారనుకుంటే… ఇప్పటికే చాలామంది తెరాసలోకి జంప్. వెళ్తున్న నాయకుల్ని ఆపేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించిందీ లేదు, అది తమ బాధ్యతే అని చొరవతో నెత్తినేసుకున్న నాయకులూ లేరు. పార్టీ కేడర్ లో మరోసారి జోష్ నింపేందుకు, పార్టీ స్థానికంగా బలోపేతంగా ఉందని నిరూపించుకునేందుకు ఇంకో అవకాశం ఇప్పుడు టి.కాంగ్రెస్ పార్టీ ముందుంది. దీన్నైనా ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.
రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్తులను దక్కించుకు తీరాలని ఇప్పటికే అధికార పార్టీ తెరాస సిద్ధమైపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు జిల్లాలవారీగా ఎన్నికల బాధ్యతల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించేశారు. సారు, కారు, 32 జెడ్పీలు అనే నినాదంతో సిద్ధమైపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటనేది ఇంకా తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చే దిశగా కాంగ్రెస్ కూడా సిద్ధమౌతోందని అంటున్నారు. ఇవాళ్ల హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ కూడా మొదలుపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని మండలాల్లో సన్నాహక సమావేశాలను పూర్తి చేసినట్టు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్… కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఈ సమావేశాలు పూర్తి చేశారు. ఇక, ఇతర నేతలు కూడా ఇంతే చురుగ్గా వ్యవహరిస్తారన్న ఆశాభావం కాంగ్రెస్ లో ఉందని అంటున్నారు.
అసలు సమస్య ఇక్కడే ఉంది. ఏదైనా ఎన్నికలకు సన్నద్ధం కావడం కంటే ముందు… నాయకుల్ని సన్నద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి టి.కాంగ్రెస్ ది. కనీసం, ఇప్పుడైనా నాయకులంతా ఒక తాటిపైకి వచ్చి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే… తెరాసకు గట్టి పోటీని ఇవ్వగలదు. ఈ మధ్యనే కాస్త పట్టుదలతో కష్టపడి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించారు. ఈ గెలుపుతో కాంగ్రెస్ కేడర్ లో కొంత ఉత్సాహం నిండిందని చెప్పొచ్చు. ఇప్పుడు అదే చొరవతో నాయకులంతా వ్యవహరిస్తే… క్షేత్రస్థాయిలో సత్తా చాటుకున్నట్టూ అవుతుంది, కాంగ్రెస్ కేడర్ బలంగా ఉందనే భరోసా కిందిస్థాయి నుంచి అన్ని స్థాయిల నాయకులకూ ఏర్పడుతుంది. పార్టీలో మిగులున్న నాయకులకి అదొక పెద్ద భరోసా అవుతుంది. మరి, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఎలా తీసుకుంటుందో చూడాలి.