వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఏపీని సాధించడానికి టీడీపీ, జనసేన కలిసి నడవాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్లో పవన్, చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై గంటకుపైగా చర్చించారు. అంతర్గతంగా ఏం చర్చించారో కానీ బయట మాత్రం… ఎన్నికల గురించి.. పొత్తుల గురించి మాట్లాడుకున్నారని చెప్పలేదు. కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదని.. ఉన్మాది పాలన నడుస్తోందని.. ఎదుర్కోవడానికి అందరూ కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన మాత్రమే కాదు బీజేపీ, లెఫ్ట్ పార్టీలను కూడా కలిసి రావాలని కోరుతున్నామన్నారు.
విశాఖలో పవన్ కల్యాణ్‌పై ప్రభుత్వం అనుసరించిన తీరుపై బాధతో ఒకసారి కలిసి సంఘీభావం చెప్పాలనుకున్నాను. అందుకే నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు వచ్చాననని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు, మీడియాకు ఎవరికీ స్వేచ్ఛ లేదు. వీళ్ల హింస తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇంత నీచమైనా దారుణమైన పార్టీని ఇంత వరకు చూడలేదన్నారు చంద్రబాబు. అవసరమైతే పదిసార్లు మాట్లాడుకుంటాం. ఇది ఎన్నికల అంశం కాదు. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన టైం వచ్చింది. ప్రజాస్వామ్యం బతికితే ఎన్నికల సంగతి ఆలోచించవచ్చు. ఇది ఒక్క రోజులో తేలేది కాదు. భవిష్యత్‌లో ఏం చేయాలో ఇంకా మాట్లాడాల్సి ఉందని పవన్ తెలిపారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు వ్యూహాత్మకంగానే మాట్లాడారు. ఎన్నికల గురించి పొత్తుల గురించి మాట్లాడలేదు. రాష్ట్రం కోసమే మాట్లాడారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయానికి ఏపీ రాజకీయవర్గాలు వస్తున్నాయి. అది తొలి అడుగేనని… కలసి నడిస్తే వచ్చే ప్రయోజనాల గురించి రెండు పార్టీలకూ అవగాహన ఉంటుంది కాబట్టి.. ఈ విషయంలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఉభయతారక నిర్ణయాలు తీసుకుంటారని రెండు పార్టీల క్యాడర్ భావిస్తున్నారు.