హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెడుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. చావా కిరణ్మయికి పార్టీ బీఫామ్ అందజేసింది. హుజూర్ నగర్ టీడీపీలో ఆమె మొదట్నుంచీ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే, గతంలో బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో స్వామిగౌడ్ కి పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆయన ఆశించిన స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేకపోయారు. అయితే, ఇప్పుడు కిరణ్మయి ఎంత వరకూ ప్రభావం చూపగలరు అనేదే చర్చ. నిజానికి, ఆమె భాజపాలోకి వెళ్లడానికి అంతా సిద్ధం చేసుకుని, చివరి నిమిషంలో ఆగిపోయారు!
హుజూర్ నగర్ స్థానం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిట్టింగ్ నియోజక వర్గం. అక్కడ కాంగ్రెస్ పార్టీదే హావా. ఈ ఉప ఎన్నికల్లో హోరాహోరీ పోరు అంటే కాంగ్రెస్, తెరాసల మధ్య ఉంటుంది. మరో పార్టీకి అవకాశం ఉండదు. అలాంటప్పుడు, టీడీపీ ఎందుకు ఇక్కడ సొంతంగా పోటీకి దిగుతోంది..? గెలుపు అసాధ్యమని తెలిసి కూడా ఆ పార్టీ ఎందుకు రంగంలోకి వస్తోంది..? టీడీపీకి మర్యాదపూర్వకమైన సంఖ్యలోనైనా ఓట్లైనా పడతాయా..? ఇలాంటి అనుమానాలు చాలానే ఉన్నాయి. వాస్తవంగా మాట్లాడుకుంటే… హుజూర్ నగర్లో కొంతమంది సెటిలర్లు, బీసీలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది టీడీపీకి మొదట్నుంచీ వెన్నుదన్నుగానే ఉంటున్నారు. ఆ ఓట్ల సంఖ్య మహా అయితే ఓ 10 వేలు ఉంటాయనే అంచనా ఉంది. ఆ మాత్రం ఓట్లు సాధించుకున్నా… టీడీపీకి మర్యాద దక్కినట్టే అవుతుంది. అయితే, హుజూర్ నగర్ టీడీపీ నుంచి కేడర్ చాలావరకూ కాంగ్రెస్, తెరాసల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఎంతమంతి మిగులున్నారనేదీ తెలీదు!
టీడీపీ గెలుస్తుందని ఆ పార్టీ కూడా అనుకోవట్లేదుగానీ… కొంత ప్రభావం చూపగలిగితే, ఆశలన్నీ వదులుకున్న కేడర్ కి కొంత ఆక్సిజన్ గా పనికొచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కారణంగా 12 సీట్లలో పోటీకి మాత్రమే టీడీపీ పరిమితం అయింది. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి… మొత్తం చేతులు ఎత్తేసిన పరిస్థితి. పార్టీ మీద కాస్తూకూస్తో అభిమానంతో ఉన్నవారు కూడా ఈ పరిస్థితిని జీర్ణించుకోలేనట్టుగా మారింది. ఇప్పుడు హుజూర్ నగర్లో సొంతంగా పోటీ చేయడం ద్వారా… ఫర్వాలేదు, మనం కూడా పోటీ చేస్తాం అనే అభిప్రాయం మిగులున్న కేడర్లో కల్పించేందుకు కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అయితే, హుజూర్ నగర్లో మరీ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితే ఎదురైతే, పార్టీకి ఇంకాస్త ఇబ్బందికరమైన అంశంగా మారుతుందనడంలోనూ సందేహం లేదు.