‘తెదేపా-భాజపాలు విడిపోతాయా? విడిపోతే ఏమవుతుంది?’ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆ రెండు పార్టీలు విడిపోతే వాటికి, రాష్ట్రానికి కూడా చాలా నష్టం. రాష్ట్రాభివృద్ధి కోసం తెదేపాకి కేంద్రం సహాయసహకారాలు చాలా అవసరం. కనుక వీలయినంత వరకు భాజపాతో కలిసి పయనించడానికే సిద్దపడవచ్చు. రాష్ట్రంలో భాజపా నేతలు వాపుని చూసి బలుపు అనుకొంటున్నారు. తమతో పొత్తులు పెట్టుకోవడం వలెనే తెదేపా 2014 ఎన్నికలలో గెలిచిందని చెప్పుకొంటున్నారు. మోడీని చూసి ప్రజలు తెదేపా-భాజపా కూటమికి ఓట్లు వేసిన మాట వాస్తవమే కానీ అదొక్కటే కారణం కాదని వారికీ తెలుసు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే భాజపా తన ఉనికిని చాటుకొంటోంది. కనుక ఈ సమయంలో అది తెదేపాతో తెగతెంపులు చేసుకొంటే అదే దానికి ప్రధమ శత్రువుగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక భాజపా కూడా వీలయిననంత వరకు తెదేపాతో స్నేహం కొనసాగించేందుకే మొగ్గు చూపవచ్చు.
ఒకవేళ తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకొంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా మంత్రులు, నేతలు రాష్ట్ర భాజపా, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయవచ్చు. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం, రైల్వే జోన్ ఏర్పాటు తదితర హామీల అమలు గురించి అది కూడా ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమించవచ్చు. వాటి కోసం గత రెండేళ్లుగా తాము కేంద్రంపై ఎంతగా ఒత్తిడి చేసింది ప్రజలకు వివరించి, మోడీ ప్రభుత్వం తమను, రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శలు గుప్పించవచ్చు.
ఇక భాజపా కూడా అందుకు ధీటుగానే స్పందించవచ్చు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.1.75 లక్షల కోట్లు ఇచ్చామని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం, వాటికి లెక్కలు అడగవచ్చు. అలాగే రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా కట్ చేసి, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేసామని గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు నాయుడుకి షాక్ ఇవ్వవచ్చు. కేంద్ర నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న అనేక పధకాలకు, అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులకు లెక్కలు అడుగుతూ, ఇకపై నిధులు విడుదల తగ్గించడం ద్వారా కేంద్రం సహాయం లేకుండా చంద్రబాబు ఏమీ చేయలేరు..ఏమీ చేయడం లేదనే సంగతి ప్రజలకు నిరూపించి చూపవచ్చును. వైకాపాతో స్నేహం చేసినా చేయకపోయినా, రాష్ట్రంలో భాజపాని బలోపేతం చేసుకొనేందుకు భాజపా కూడా ఫిరాయింపులని ప్రోత్సహించవచ్చు .
అయితే రాష్ట్రాభివృద్ధికి తగినన్ని నిధులు ఇవ్వకుండా నిలిపివేసినట్లయితే, కేంద్రంపై తెదేపా నేతలు ఇంకా జోరుగా దుష్ప్రచారం చేసినట్లయితే రాష్ట్ర భాజపాకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కనుక వీలయిననంత వరకు తెదేపాతో పొత్తులు కొనసాగించేందుకే భాజపా అధిష్టానం కూడా మ్రోగ్గు చూపవచ్చు. ప్రస్తుతం ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి ఆధారపడున్నాయి కనుక పొత్తులు కొనసాగించడానికే అవి మ్రోగ్గు చూపవచ్చు.