తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎల్ రమణకు ఫోన్ చేసి.. మద్దతు అడిగినా… టీడీపీ మాత్రం నిర్ణయం ప్రకటించలేదు. పోటీ చేయాలనే అభిప్రాయమే తెలంగాణ టీడీపీలో ఎక్కువగా వినిపిస్తోంది. హుజూర్ నగర్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై తెలంగాణ టీడీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. హుజూర్ నగర్లో పోటీ చేసే అంశంపై టీ టీడీపీ నేతలు ఎల్. రమణ అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశమయ్యారు. అయితే దీనిపై నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన టీడీపీ…హుజూర్ నగర్లో కాంగ్రెస్కు మద్దతు తెలిపింది.
తెలంగాణ టీడీపీ నేతలు ఒంటరిగా పోటీ చ ేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వొద్దని నల్గొండ జిల్లా టీడీపీ నేతలు తీర్మానించారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తేనే భవిష్యత్ ఉంటుందంటుని వాదిస్తున్నారు. టీడీపీకి మంచి క్యాడర్ ఉంది, హుజూర్నగర్లో సత్తా చాటుతామని తెలంగాణ టీడీపీ నేతలు అంటున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హడావుడి చేసింది. మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసింది. అయితే ఎన్నికల తరువాత కాంగ్రెస్తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ… హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే.. క్యాడర్ లో మళ్లీ కదలిక వస్తుందని నమ్ముతోంది.
తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసుకునే అంశంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు… హుజూర్ నగర్లో పోటీపై త్వరలోనే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వబోతున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 30వ తేదీతో ఆ గడువు ముగుస్తుంది. చంద్రబాబు నిర్ణయం తీసుకునే సరికి ఆ సమయం కూడా గడిచిపోతుందనే సెటైర్లు పడుతున్నాయి.