తెలుగుదేశం పార్టీకి చెందిన మరొక ఎమ్మెల్యే, ఆ పార్టీకి హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాధ్ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో డబ్బు ఇచ్చి ఓటు వేయించుకునేందుకు ప్రయత్నించిన ఓటుకు నోటు కేసులోనే మరో నిందితుడిగా విచారించేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఓటుకు నోటు కేసులో ఇప్పటికే రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇద్దరు ఎమ్మెల్యేలూ అరెస్టు అయి.. జైలుశిక్షను కూడా అనుభవించి ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరికొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు కూడా పాత్ర ఉన్నట్లుగా తొలినుంచి పుకార్లు వినిపిస్తూనే వచ్చాయి. తాజాగా మాగంటి గోపీనాధ్ మీద ఆధారాలు ఉన్నాయని, ఆయనను అరెస్టు చేసి విచారిస్తారని వార్తలు వస్తున్నాయి.
ఒకవైపు తెలుగుదేశం పార్టీనుంచి ఎమ్మెల్యేలంతా క్యూకట్టి తెరాసలో చేరిపోతూ ఉన్న తరుణంలో.. పార్టీలో మిగిలిన ఉన్న ఎమ్మెల్యేల్లో మాగంటిని కూడా అరెస్టు చేసినట్లయితే పార్టీకి పెద్ద దెబ్బ పడినట్లే పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ పార్టీలో మిగిలిందే ఆరుగురు ఎమ్మెల్యేలు. వారిలో ఆర్.కృష్ణయ్య పార్టీకి దూరంగానే మెలగుతున్నారు. అయిదుగురిలో ఇద్దరు బెయిలుపై ఉన్నారు. మిగిలిన ముగ్గురిలో గోపీనాధ్ కూడా అరెస్టు అయితే.. చెప్పుకోడానికి ఇద్దరు మిగులుతారు. మరి ”ఇంకా ఇద్దరు ముగ్గురు తెరాసలో చేరబోతున్నారు” అనే ఎర్రబెల్లి మాటలు నిజమైతే.. వారు కూడా ఫిరాయించేస్తారని అనుకోవాల్సి ఉంటుంది. ఆ ఇద్దరి కోటాలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ కూడా నేడో రేపో చేరిపోతున్నారని అనుకుంటున్నారు.
మరోవైపు తనను అరెస్టు చేస్తారంటూ వస్తున్న వార్తలను మాగంటి గోపీనాధ్ ఖండిస్తున్నారు. ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అంటున్నారు. తెరాసలో చేరాల్సిందిగా తనకు ఎవరూ ఆఫర్ చేయలేదని, తాను ఎప్పటికీ తెలుగుదేశంలోనే కొనసాగుతానని ఆయన అంటున్నారు.