ఆంధ్రాకి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందనీ, కేంద్ర బడ్జెట్ లో మొండి చేయి చూపిందని టీడీపీ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు కేంద్రంపై ఆగ్రహించడం, సీఎం చంద్రబాబు అనుమతి ఇస్తే రాజీనామాలు చేసేస్తామంటూ రాయపాటి ప్రకటించడం, ఇంకా పొత్తు కొనసాగించడం అర్థంలేనితనం అని జేసీ వ్యాఖ్యానించడం… ఇలా వాతావరణం కొంత వేడెక్కిఉంది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత స్పష్టంగానే ఉన్నట్టు అనిపిస్తోంది! ‘కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం’ అని మాత్రమే అంటున్నారు. తెంచుకునే వరకూ లాగరు అనే ధోరణిలో ఆయన ప్రకటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వైఖరిని ఈ భేటీలో ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలతో రాజీనామా లేఖలు తీసుకుని, చంద్రబాబు దగ్గరే పెట్టుకుని… ఆ తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపి ఒత్తిడి పెంచాలనేది టీడీపీ వ్యూహమనీ, దీనిపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చలు ఉంటాయని సమాచారం. టీడీపీ నిజంగానే ఎంపీలు రాజీనామాల వరకూ వెళ్తారా..? మంత్రుల రాజీనామా లేఖలు చంద్రబాబు వరకూ పరిమితమా..? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తెరమీదికి వచ్చాయి.
కేంద్రంపై టీడీపీ ఒత్తిడి పెంచాల్సిన అసలైన తరుణం ఇది. ఇప్పటికీ మెతక వైఖరి అనుసరిస్తే… కేంద్రం ఇవ్వలేదన్న అంశం కంటే, టీడీపీ అడగలేకపోయిందన్న పాయింట్ విపక్షాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే, బడ్జెట్ తరువాతి పరిణామాలపై వైకాపా కూడా కొంత వేచి చూస్తున్న ధోరణిలో ఉంది. అలాగని, చంద్రబాబు దూకుడుగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు! ఎందుకంటే, ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగానే సమయం ఉంది. పోలవరం, రాజధాని, ప్యాకేజీ నిధులు, రెవెన్యూలోటు.. ఇలా చాలా అవసరాలు కేంద్రంతో ఉన్నాయి. కాబట్టి, ఉన్నపళంగా పొత్తు తెంచుకునే వరకూ టీడీపీ వెళ్లదనేది విశ్లేషకుల మాట. మరి, అలాంటప్పుడు టీడీపీ ఎంపీలూ మంత్రులూ రాజీనామాల వరకూ వెళ్లే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చర్చనీయాంశమే అవుతుంది. అయితే, ‘మా పార్టీ ఎంపీలూ మంత్రులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు’ అనే సంకేతాలు కేంద్రానికి చేరే విధంగా ఈ భేటీలో నిర్ణయాలు ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
సరే, టీడీపీ ఎంపీలూ మంత్రులూ త్వరలో రాజీనామా చేస్తారనే అంశాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందా..? అంటే, లైట్ తీసుకుంటుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే రాజస్థాన్ లో రెండు ఎంపీ స్థానాలకి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. భాజపా ఘోరంగా ఓడిపోయింది. అంతకుముందు, గుజరాత్ ఎన్నికల ఫలితాలు కూడా భాజపాకి చిన్న ఝలక్ ఇచ్చాయి. ఇక, మిత్రపక్షమైన శివసేన కూడా ఎన్డీయే నుంచి బయటకి వెళ్తోంది. భాజపా వ్యతిరేక శక్తులకు చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తారనే ఊహాగానాలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నిర్ణయంపై జాతీయ స్థాయిలో కూడా కొంత ఆసక్తి నెలకొంది. మరి, ఈ కీలక భేటీ తరువాత టీడీపీ ప్రకటనలు ఎలా ఉంటాయో చూడాలి.