తెలుగుదేశం పార్టీ పెద్దగా హడావుడి చేయకపోయినా బీజేపీ సైడే నిలుస్తోంది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో మద్దతుగా ఓటేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి టీడీపీకి ఉన్న బలం తో బీజేపీకి ఒరిగేదేమీ లేదు. అయినా బీజేపీ రాజకీయ పరిణామాల విషయంలో వ్యూహాత్మకంగా స్పందించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకొస్తున్న బిల్లును వ్యతిరేకించాలని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చాలా మంది ప్రతిపక్ష నేతల్ని కలిశారు. కానీ చంద్రబాబును కలవలేదు. వ్యతిరేకించాలని కోరలేదు.
అదే సమయంలో కేజ్రీవాల్ కేసీఆర్ ను కలిశారు. ఆయన ఆ బిల్లును వ్యతిరేకిస్తామని.. వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. చంద్రబాబును ఎవరూ ఆప్ నుంచి వ్యతిరేకంగా ఓటు వేయాలని సంప్రదించలేదు. అదే సమయంలో బీజేపీ నుంచి ఆయనకు విజ్ఞప్తి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల బీజేపీ ఏపీ రాజకీయాల విషయంలో డబుల్ గేమ్ ఆడుతోంది. రెండు పార్టీలతోనూ సన్నిహితంగా ఉంటోంది. వైసీపీ విషయంలో మాత్రం.. విమర్శలు ఎక్కు పెడుతోంది. టీడీపీ విషయంలో ఎలాంటి విమర్శలు చేయడం లేదు.
అన్ని పరిణామాలు ఆలోచించిన తర్వాత చంద్రబాబు… ఢిల్లీ బిల్లుకు మద్దతుగా ఓటేయాలని నిర్ణయించుకున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా రాజకీయ పరమైన కోణంలో తీసుకున్న నిర్ణయమని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించింది.