దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరో అయిపోయాడు. తన డెబ్యూ సినిమా ‘అహింస’ ఈవారమే విడుదల కాబోతోంది. ఈ సినిమా జయాపజయాలు ఎలా ఉన్నా.. సురేష్‌బాబుకి ఓ భారం తప్పిపోయింది. తనని హీరోగా చూడాలన్నది రామానాయుడు కల. ఆశ. కానీ అది ఆయన ఉన్నప్పుడు తీరలేదు. ఓరకంగా రామానాయుడు ఆఖరి కోరిక అది. దాన్ని ఓ కొడుకుగా `అహింస`తో తీర్చుకొన్నాడు సురేష్‌బాబు. నిజానికి ‘అహింస’ సినిమా అంత ఈజీగా పూర్తవ్వలేదు. మధ్యలో చాలా తలనొప్పి వ్యవహారాలు నడిచాయి. తేజ స్కూల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో తేజకీ, అభిరామ్ కీ మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, మధ్యలో సినిమా ఆగిపోయిందని రకరకాల వార్తలొచ్చాయి. అసలు ఈ ప్రాజెక్టులోకి తేజ రావడమే విచిత్రంగా జరిగింది. పెద్ద దర్శకులెవరూ… అభిరామ్ తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించకపోతే, తేజ దేవుడిలా వచ్చి ఈ సినిమా బాధ్యత నెత్తిమీద వేసుకొన్నాడు. ఎట్టకేలకు ఈ సినిమా పూర్తయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా బయటకు రాకుండానే… తేజతో ఓ సినిమా చేయడానికి రానా అంగీకారం తెలిపాడు. ఈ సినిమాకి రాక్షస రాజు అనే టైటిల్ కూడా ఖరారైపోయింది. నిజానికి ఓ సినిమా విడుదల ముందు ఇలాంటి ప్రాజెక్టులు ప్రకటించి, సదరు సినిమాపై హైప్ తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రాజెక్టు కూడా అందులో భాగమా? లేదంటే నిజంగానే తేజ రుణం తీర్చుకొనే ప్రయత్నమా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేనే రాజు – నేనే మంత్రి లాంటి హిట్ ఇచ్చినప్పటికీ, ఇప్పుడున్న ఫామ్ ని బట్టి చూస్తే తేజని రానా లాంటి హీరో నమ్మి సినిమా చేస్తాననడం పెద్ద విషయమే. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా? లేదంటే వార్తలకే పరిమితం అవుతుందా? అనేది జూన్ 2 తరవాతే తేలుతుంది. ఎందుకంటే… ‘అహింస’ రిలీజ్ అయ్యేది అప్పుడే. సినిమా బాగుంటే.. కాంబో ఓకే అవుతుంది. లేకుంటే మాత్రం డౌటే.