తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి నివేదన సభకు వెళ్లబోయే ముందు.. కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇలా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తూ ఉండటంతో… అసెంబ్లీ రద్దు కోసమేనని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ.. అసెంబ్లీ రద్దు ఇవాళ కేబినెట్ భేటీలో ఉండే అవకాశం లేదని.. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు భారీగా వరాలు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధానంగా రైతులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని కొన్ని వరాలు ప్రకటించనున్నారు. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన మధ్యంతర భృతి కాస్త ఎక్కువగానే ప్రకటించనున్నారు. నిన్న విద్యుత్ ఉద్యోగులకు ఏకంగా 35శాతం వేతన సవరణ ప్రకటించారు. మిగతా ఉద్యోగుల విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది.
రైతులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. రెైతుబంధు రెండో విడతకు ఇప్పటికే నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం… రెండో దఫా చెక్కుల పంపిణీ తేదీని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. నవంబర్ నెల రెండో వారంలో చెక్కుల పంపిణీ ఉండవచ్చు. జోనల్ వ్యవస్థకు ఆమోదం వచ్చింది కాబట్టి.. భారీగా ఉద్యోగ నియాకాల నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ-ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్చకుల పదవీ విరమణ వయస్సు పెంపు, మౌజామ్ లకు వేతనం పెంపు లాంటి ప్రకటనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.
పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు కానీ.. అసెంబ్లీని మాత్రం రద్దు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఇన్ని నిర్ణయాలు తీసుకుని ఇదే కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దు నిర్ణయాన్నికూడా తీసుకుంటే..వాటికి విలువ ఉండదు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను.. కొంగరకాలన్ సభలో కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ముందస్తుపై ప్రకటించి.. తర్వాత ఒకటి రెండు రోజుల్లో మరోసారి కేబినెట్ భేటీ నిర్వహించి అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేయనున్నారని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాల్సిన అవసరం లేదని.. గవర్నర్ కూడా క్లారిటీ ఇవ్వడంతో.. కేసీఆర్కు పెద్ద భారం దిగిపోయింది. మొత్తంగా చూస్తే.. అసెంబ్లీ రద్దు నిర్ణయం ఈ రోజు కేబినెట్లో తీసుకునే చాన్స్ లేదు. కానీ కేసీఆర్ రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో మాత్రం చెప్పలేం.