“మంచి పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు … మళ్లీ పెళ్లి చేయండి సత్తా చాటుతా ” అని చెప్పినట్లుగా కేసీఆర్ తీరు ఉందని సీపీఐ నేత నారాయణ సీరియస్‌గా అయినా సెటైరిక్‌గా విమర్శ చేశాడు. లోతుగా ఆలోచిస్తే.. ఇందులో నిజం ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా తొమ్మిది నెలల గడువు ఉంది. పైగా.. తన పార్టీ విధానం అయిన జమిలికి మద్దతుగా… లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. అంతే కాదు.. తన ప్రభుత్వానికి .. ఒక్కటంటే.. ఒక్క శాతం కూడా ముప్పు లేదు. ప్రభుత్వం అత్యంత స్థిరంగా ఉంది. ప్రతి పక్షాలే .. కేసీఆర్ దెబ్బకు ఉనికి కాపాడుకోవడానికి.,. నానా తంటాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ప్రచారం కూడా ప్రారంభించారు.
ఎక్కడకు వెళ్లినా.. కేసీఆర్‌కు మొదటగా వచ్చే ప్రశ్న.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటనే..!. దీనికి తొలి సభలోనే.. కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. ఆ వివరణలో.. ప్రజలను సంతృప్తి పరిచే విషయం ఉందా అన్నదే సందేహం. ప్రతిపక్ష పార్టీ నేతగా.. ఎన్నికల ప్రచారానికి వెళ్తే.. అధికార పక్షంపై ఎంతగా దుమ్మెత్తి పోస్తారో.. ఇప్పుడు నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. కాంగ్రెస్ పార్టీపై అలాగే దుమ్మెత్తి పోస్తున్నారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో ఉండి.. తెంలగాణలో ఉన్న సమస్యలన్నింటికీ కాంగ్రెస్‌నే కారణమని నిందిస్తున్నారు. ఆ పార్టీ వల్లే ముందస్తుకు వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. ముందస్తుకు వెళ్లేంతగా.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎలాంటి పోరాటాలు చేయలేదు. గాంధీభవన్ విమర్శలకే పరిమితమియందని.. విమర్శలు ఎదుర్కొంది. అలాంటి పార్టీ వల్ల మందస్తుకు వెళ్లడం ఏమిటి..?. ప్రతిపక్షం ఉన్నదే విమర్శలు చేయాడానికి.. తప్పులు ఎంచడానికి…! ప్రతిపక్షం అలా చేస్తుందని.. ఎవరైనా అసెంబ్లీని రద్దు చేస్తారా..?
కేసీఆర్ నిన్నటిదాకా అంతులేని అధికారాన్ని అనుభవించారు. సుల్తాన్ ఆఫ్ తెలంగాణ అన్నట్లుగా.. తను ఏది చెబితే అదే శాసనంగా నడిచింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు కేర్ టేకర్ సీఎం మాత్రమే. రాజకీయ వేడి పెరిగే కొద్దీ.. కేసీఆర్‌కు అధికారం వల్ల ప్రజల్లో వచ్చిన భయభక్తులు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ప్రశ్నించే గొంతులు అంతకంతకూ పెరుగుతూ ఉంటాయి. అది కచ్చితంగా టీఆర్ఎస్ అధినేతకు ఇబ్బందికరమే. ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే.. తొమ్మిది నెలలు ముందుగానే ఎందుకు ఎన్నికలు తెచ్చి పెట్టాల్సి వచ్చిందనే భావన పెరిగితే.. అంతిమంగా కేసీఆర్‌కు పూడ్చుకోలేని నష్టం వస్తుంది. ఎందుకంటే.. కేసీఆర్ ఎంత మాయల మారాఠీ అయినా.. ముందస్తుకు ఎందుకెళ్లాల్సి వచ్చిందనే కారణాలను సమర్థంగా చెప్పడానికి అవసరమైన పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. కాంగ్రెస్ పార్టీపై ఎన్ని నిందలేసినా… తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా.. నాలుగున్నరేళ్ల పాటు.. ఏమీ చేయకుండా… కాంగ్రెస్‌ను నిందిస్తూ.. మళ్లీ అవకాశం అడగడమేమిటన్న ప్రశ్న ప్రజల్లో సహజంగా వస్తుంది. ఇది ఇప్పుడే పుడుతోంది. ఓటింగ్ సమయానికి పెరిగి పెద్దదైతే… టీఆర్ఎస్కు జరిగే నష్టాన్ని ఊహించలేము..!