వెట్రిమారన్ కథలు, పాత్రలు, వాటి మధ్య సంఘర్షణలు అన్నీ సహజంగా ఉంటాయి. సమస్యని గ్లోరిఫై చేయడం తనకు తెలీదు. ఉన్నది ఉన్నట్టుగా తీస్తాడు. ఆ మాటకొస్తే.. ఇంకా `రా`గా తీసి చూపిస్తాడు. తన సినిమాల్లో ఆ `రా`నెస్ బాగా నచ్చుతుంది. తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకొన్న `విడుదలై`లో కూడా అదే ఉంది. ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈనెల 15న ఈ సినిమా వస్తోంది. ప్రివ్యూలు కూడా మొదలైపోయాయి.
`విడుదదలై` ఓ హార్ట్ టచింగ్ సినిమా. అటవీ నేపథ్యంలో సాగుతుంది. గిరిజనులపై పోలీసుల జులూంని కళ్లకు కట్టినట్టు చూపించారు. అప్పట్లో… పోలీసుల దౌర్జన్యకాండ ఎలా ఉండేదో కళ్లకు కట్టారు. కొన్ని సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై పోలీసులు చేసే దాడి, వాళ్లని ఇంటరాగేషన్ చేసే పద్ధతి, పోలీస్ స్టేషన్లో వాళ్లని లాఠీలతో చితకబాదే సన్నివేశాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగించే విధానం.. ఇవన్నీ చూడలేని స్థాయిలో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. నిజంగా అలా జరిగి ఉండొచ్చు గాక. ఆ తీత తమిళ ప్రేక్షకులకు నచ్చి ఉండొచ్చు గాక… కానీ.. ఆ హింసని తెలుగు ప్రేక్షకులు తట్టుకోగలరా? అనేది అనుమానమే. అది ఒక్కటీ మినహాయిస్తే.. `విడుదలై` చూడాల్సిన చిత్రం. అటవీ నేపథ్యంలో సాగే కథలో.. పాత్రలు, సంఘర్షణలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ గుర్తుండిపోతుంది. వెట్రిమారన్ నుంచి వచ్చిన మరో.. మంచి సినిమా ఇది. మరి తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో?