డ్యాం సేఫ్టీ బిల్లును ప్రవేశ పెడుతూ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సాక్షాత్తూ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టుకు ఒకటిన్నర రెట్లు వరద వచ్చిందని కానీ గేట్లు ఎత్తలేదని.. చివరికి ఎత్తేందుకు ప్రయత్నించినా ఓ గేటు పని చేయలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పడమే కాదు .. అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే పరువుపోతుందన్నారు. ఈ మాటలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. అందరి దృష్టి రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది.
అన్నమయ్య డ్యాం నిర్వహణ విషయంలో ప్రభుత్వంపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. గేట్ల నిర్వహణ పట్టించుకోలేదని.. మరమ్మతుల గురించిఆలోచించలేదని.. పైగా వరద ముంచుకొస్తుందని తెలిసినా ఇసుక కోసం నీటిని దిగువకు విడుదల చేయలేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో డ్యాం దిగువ ప్రాంత ప్రజలకు కనీస సమాచారం కూడా వెళ్లకపోవడం.. వారికి అందిన సమాచారం వల్లనే గుట్టపైకి వెళ్లి మిగిలిన వారు ప్రాణాలు కాపాడుకున్నారు. అందుకే ప్రమాదంలో జ్యూడిషియల్ విచారణ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.
అయితే అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే భారత్ పరువు పోతుందని మంత్రి గజేంద్ర షెకావత్ వ్యాఖ్యానించారు. అయితే అంతర్జాతీయ పరిశీలన సరే… మరి కేంద్రానికి బాధ్యత లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓ దారుణమైన నిర్లక్ష్యానికి మునిగిపోయిన ప్రజలు.. కొట్టుకుపోయిన ప్రాణాలకు ఏం సమాధానం చెబుతారన్న చర్చ మాత్రం సహజంగానే వస్తుంది. కేంద్రం ఎందుకు బాధ్యత తీసుకుని విచారణ జరపదన్న సందేహం సామాన్య ప్రజలకు వస్తుంది.
రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్వహణ ఇప్పుడు డొలయమానంలో పడింది. రోడ్లు వేయడం.. ప్రాజెక్టులను నిర్వహించడం వంటివి ప్రస్తుత ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశాలు కాదు. ఈ కారణంగా దశాబ్దాల పాటు శ్రమించినా పూడ్చుకోలేని నష్టం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనూ కేంద్రం స్పందించకపోతే మొదటికే మోసం వస్తుంది. తీరిగ్గా విచారించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే కేంద్రమే మేలుకోవాల్సి ఉంది.