ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత రిజర్వేషన్ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో, తాను క్రిస్టియన్ అని సుచరిత స్వయంగా చెప్పినట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మతం మార్చుకుంటే రిజర్వేషన్లు అనుభవించడం సాధ్యం కాదు. దీంతో లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు మేరకు వారం రోజుల్లోగా వివరాలు పంపాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు.
మేకతోటి సుచరిత క్రిస్టియన్ అని ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే కాదు.. గుంటూరు జిల్లా మొత్తం తెలుసు. ఆమె కుటుంబం పూర్తి స్థాయిలో క్రిస్టియానిటీ పాటిస్తారు. అదే విషయాన్ని పలుమార్లు ఇంటర్యూల్లో కూడా చెప్పుకున్నారు. అదే విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను కోరింది. అయితే హోంమంత్రికి వ్యతిరేక నివేదికను కలెక్టర్ ఎలా ఇస్తారని సహజంగానే అందరికీ అనుమానాలొస్తాయి. వైసీపీ ప్రభుత్వంలో అలాంటిచాన్సే లేదని అంటున్నాయి. అందుకే కలెక్టర్ ద్వారా కాకుండా నేరుగా విచారణ జరిపించాలన్న డిమాండ్లు జాతీయ ఎస్సీ కమిషన్‌కు వెళ్తున్నాయి.
ఏపీలో ఒక్క సుచరిత మాత్రామే కాదు పలువురు ప్రజాప్రతినిధులు ఎస్సీ రిజర్వేషన్ కింద పోటీ చేసి గెలిచిన వారిలో క్రిస్టియన్ మతం మార్చుకున్న వాళ్లు ఉన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి .. తాను క్రిస్టియన్‌ను అని..తన భర్త కాపు అని ఇంటర్యూల్లో వెల్లడించారు. ఆమెకు రిజర్వేషన్ వర్తించదని… అయినప్పటికీ..దళిత మహిళగా చెప్పుకుని.. ఎస్సీలకు చెందిన సీటు నుంచి పోటీ చేసి.. దళితులను మోసం చేశారని ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేయమని ఆదేశాలు వచ్చినా ఏం చర్యలు తీసుకోలేదు. అలాంటివి చాలా కేసులు ఉన్నా .. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి విచారణకు ఆదేశాలు వస్తున్నా.. నివేదికలు ఇస్తున్నారో లేదో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.