జగన్మోహన్ రెడ్డి మనస్థత్వం.. ఆయన వ్యవహారశైలిపై విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయి. మరోసారి మండలి రద్దు తీర్మానం చేసినా చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో ఓడిపోయి… భవిష్యత్ భయానకం అనే సూచనలు రావడంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ధిక్కరిస్తారన్న ప్రచారం మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి పరీక్ష పెట్టింది ఎమ్మెల్సీ ఎన్నికే.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసినా… చెల్లని ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తారు. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. అలా జిల్లాకు ఒకరు చొప్పున సైలెంట్ గా ఉంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి చేరవేసినట్లు తెలుస్తుంది. దీంతో ఏడో స్థానం విషయంలో ఆయన టెన్షన్ పడిపోతున్నారు.
సీఎం జగన్ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతన్నారు. పొరపాటున ఎవరైనా దారి తప్పిదే అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జగన్ పట్టు జారిపోయిందన్న అభిప్రాయం కల్పిస్తుంది.
అదే జరిగితే జగన్ అసహనానికి గురవుతారు. మండలిని ముందుగా అనుకున్నట్లుగా రద్దు చేస్తే సమస్యే ఉండేది కాదని.. ఇప్పుడైనా రద్దు చేస్తే ఏమవుతుందని ఆయన ఆవేశంగా నిర్ణయం తీసుకోవచ్చని వైసీపీలో సెటైర్లు పడుతున్నాయి.