ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును హైకమాండ్.. ఢిల్లీ పిలిపించింది. కారణం ఏమిటో స్పష్టత లేదు కానీ.. తిరుపతి ఉపఎన్నికల విషయంలో.. జనసేన పార్టీ నుంచి వస్తున్న అభ్యంతరాలు.. ఆ పార్టీ నేతల నుంచి సోము వీర్రాజుపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించేందుకే పిలిపించినట్లుగా చెబుతున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో… తిరుపతిలో బీజేపీనే పోటీ చేస్తుందని.. దానికి పవన్ కల్యాణ్ అంగీకరించారని.. జేపీ నడ్డా పేరు ఉపయోగించి మరీ సోము వీర్రాజు ప్రకటించారు. అలా తాము ఎప్పుడు చెప్పామని… జనసేన నేతలు.. బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపారు. తాము పోటీ చేయాలనుకుంటున్న విషయం స్పష్టం చేశామని.. ఇప్పుడు.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపేందుకు మిత్ర ధర్మాన్ని విస్మరిస్తున్నారన్న అభిప్రాయం జనసేన నేతలు వ్యక్తం చేశారు.
అదే సమయంలో సోము వీర్రాజు వ్యవహారశైలిపై జనసేన అసంతృప్తిగాఉందని చెబుతున్నారు. సోము తీరు వల్ల… బీజేపీ వైసీపీకి అనుకూలమైన పార్టీగా ముద్ర పడుతోందని.. ఆ ఎఫెక్ట్ జనసేన పార్టీపైన కూడా పడుతోందన్న అభిప్రాయాన్ని నివేదిక రూపంలో జనసేన నేతలు పంపించారంటున్నారు. ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ప్రకటనలు చేయడం… ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పెద్దగా స్పందన లేకపోవడం .. వంటివి..బీజేపీ హైకమాండ్ ను దాటి పోలేదని చెబుతున్నారు.
తిరుపతిలో జనసేన పోటీ చేయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకుంది. ఓ కమిటీని నియమించి.. తమ బలాన్ని బేరీజు వేసుకుంది. జనసేన పోటీ చేస్తేనే… ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓ బలమైన సామాజికవర్గం అండగా ఉంటుందని..లేకపోతే.. ఓట్లు చీలిపోతాయని.. వారెవరూ బీజేపీకి ఓటేయరన్న అభిప్రాయం ఇప్పటికే ప్రారంభమయింది. వీటన్నింటిపై… సోము వీర్రాజుకు.. పార్టీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చి పంపించే అవకాశం ఉందంటున్నారు.