కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించి అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తొందరగా నివేదిక అందజేయాలని జస్టిస్ చంద్రఘోష్ టీంను ప్రభుత్వం కోరింది. దీంతో జ్యుడిషియల్ కమిషన్ ఎవరికి ముందుగా నోటిసులు ఇచ్చి విచారణకు రావాలని కోరనుంది..? కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించనుందా.?బీఆర్ఎస్ మొదటి దఫా ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు కూడా నోటిసులు ఇస్తారా..? అధికారులు, ఇంజినీర్లను ప్రశ్నించినట్టుగానే లీడర్లను కూడా ప్రశ్నించనుందా..? అనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.
గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రఘోష్ టీం సమాధానం ఇచ్చింది. విచారణలో భాగంగా లీడర్లను కూడా విచారణకు హాజరయ్యేలా నోటిసులు ఇస్తారా..? ప్రశ్నించగా… అవసరమని భావిస్తే తప్పకుండా రాజకీయ నాయకులకు కూడా నోటిసులు ఇచ్చి విచారణకు పిలుస్తామని స్పష్టం చేయడంతో గత ప్రభుత్వ పెద్దలకు సమన్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. లీగల్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా విచారణను కొనసాగిస్తామని…లీగల్ అంశాలను పరిగణనలోకి తీసుకోకపోతే కోర్టుల నుంచి స్టే వచ్చే అవకాశం ఉందని చంద్రఘోష్ స్పష్టం చేశారు.
అయితే, ఇప్పటికిప్పుడు కేసీఆర్ , హరీష్ రావులకు నోటిసులు ఇచ్చే అవకాశం లేదని.. మొదట ఇంజినీర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులను విచారించిన తర్వాతే లీడర్లకు నోటిసులు ఇస్తారని తెలుస్తోంది.