శాసనమండలిలో తమకున్న బలంతో కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టాలనుకుంటున్న జగన్ రెడ్డి ప్రయత్నాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ వ్యూహం రెడీ చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
ఎలాగైనా ఈ టర్మ్ లో రాజధానిగా అమరావతికి ఓ రూపునివ్వాలని టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా స్పీడ్ పెంచారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అమరావతి ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు రాజధాని నిర్మాణంలో చేపట్టాల్సిన భవన నిర్మాణాలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్నారు. అమరావతి విషయంలో సర్కార్ ఇలా దూకుడుగా వ్యవహరిస్తుండగా..వైసీపీ నుంచి ఎదురయ్యే చిక్కులను కూడా అంచనా వేస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన బిల్లులతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది.
ప్రభుత్వం తీసుకొచ్చే ఈ కీలకమైన బిల్లులను మండలిలో వైసీపీ అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది. కౌన్సిల్ లో ఆ పార్టీకి 38మంది సభ్యుల బలం ఉండటంతో అక్కడ ఉనికి చాటుకునేందుకు ఎలాగైనా అభ్యంతరం తెలపనుంది. ఇప్పటికే ఆ దిశగా జగన్ రెడ్డి ఎమ్మెల్సీలకు సందేశం ఇచ్చారు. ఎలాగూ మండలిలో కీలక బిల్లులకు వైసీపీ అభ్యంతరం తెలపడం ఖాయమని భావిస్తోన్న చంద్రబాబు.. రాజధాని విషయంలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లే విషయంపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా మండలిని రద్దు చేస్తారా? అని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. రానున్న మూడేళ్లలో మండలిలో వైసీపీ బలం ఎలాగూ తగ్గుతుంది. ఆ తర్వాత కూటమికి సంఖ్యా బలం పెరుగుతుంది. సో, మండలిని రద్దు చేయడం కంటే ఈ మూడేళ్లు అచేతన అవస్థలో పెట్టేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే విషయమై చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నారని అంటున్నారు.