జూన్ నెలఖారులో నిర్వహిస్తారని ప్రచారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను మరికొద్ది నెలలపాటు వాయిదా వేయనున్నారా..? ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాకే లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందా..? అంటే ప్రభుత్వ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం మరో నాలుగైదు నెలల తర్వాత నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని సీఎం రేవంత్ భావిస్తుండటంతో ఇందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారుల సూచన మేరకు ఈ ఎన్నికలను జనవరిలో జరిపే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయితీ, మున్సిపాలిటీలకు వెనువెంటనే ఎన్నికలను నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
జనవరిలో ముందుగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ అనంతరం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 42శాతానికి బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారుల సూచన మేరకు జనవరిలో ఒకదాని తర్వాత ఒక ఎన్నికలను నిర్వహించే ఉద్దేశంతో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.