నలుగురు టీడీపీ ఎంపీలు భాజపాలో చేరడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే, ఆయన పేరున పార్టీ ఒక నోట్ విడుదల చేసింది. వీళ్లు వెళ్తున్నంత మాత్రాన పార్టీకి నష్టం లేదనీ, భవిష్యత్తులో వీళ్లే చింతిస్తారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. టీడీపీలో చీలికలు తీసుకొచ్చేందుకు ఇదంతా భాజపా ఆడుతున్న మైండ్ గేమ్ అన్నారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ, ఇలాంటి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందనీ, ఇప్పుడూ సమర్థంగా తట్టుకుని ముందుకు సాగుతుందన్నారు. పార్టీ ప్రజల్లోనే ఉంటుందనీ, ప్రజల పక్షాన నిలబడుతుందనీ, కార్యకర్తలెవ్వరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు నాయుడు ధీమా పెంచే ప్రయత్నం చేశారు.
సంక్షోభాలను తట్టుకోవడం కొత్త కాదు అని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతున్నమాటే, ఇప్పుడూ చెప్పారు. అయితే, ఇప్పుడు తెలుగుదేశం ఎదుర్కొంటున్నది సంక్షోభం అనే కంటే… స్వయంకృతం అనొచ్చు. ఎలా అంటే… పార్టీలో నిబద్ధత అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. కారణం… అధికారంలో ఉండగా టీడీపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలే అనొచ్చు. ఇతర పార్టీల నుంచి నాయకులను పార్టీలో చేర్చుకుని, ఎప్పట్నుంచో పార్టీలో ఉన్నవారికి కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే నిబద్ధత అనేది దెబ్బతినడం మొదలుపెట్టింది. ఉదాహరణకు, ఇప్పుడు టీడీపీ నుంచి భాజపాలోకి జంప్ చేసిన టీజీ వెంకటేష్ అప్పట్లో కాంగ్రెస్ లో ఉండేవారు. అనూహ్యంగా టీడీపీలోకి ఆయన వచ్చారు. పాపం.. ఆయన అప్పుడూ రాయలసీమ అభివృద్ధి కోసమే వచ్చానన్నార్లెండి, ఇప్పటిలానే! ఆ వెంటనే, ఆయనకి రాజ్యసభ సీటుని టీడీపీ ఇచ్చేసింది. అలాంటి సమయంలో నిబద్ధతతో ఉన్నవారి మనోభావాలు కచ్చితంగా దెబ్బతింటాయి. ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే తరహాలో, వైకాపా నుంచి గెలిచినవారిని పార్టీలోకి తీసుకుని, కొందర్ని మంత్రులు చేసేశారు! దీంతో పార్టీకి లాయల్ గా ఉంటున్నవారు బాధపడాల్సి వచ్చింది. ఏతావాతా ఫిరాయింపుల ప్రోత్సాహం, ప్రత్యేక అవసరాల పేరుతో కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత పెంచడంతో పార్టీలో నిబద్ధత అనే మాటకు అర్థం లేకుండా పోయింది!
కాబట్టి, ఇప్పుడీ నలుగురూ పార్టీకి నిబద్ధులై లేరని విచారించినా విమర్శించినా పెద్దగా ప్రయోజనం లేదు. రేప్పొద్దున్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా భాజపా తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదు. కాబట్టి, ఈ సందర్భంగా టీడీపీ గుర్తించాల్సిన అంశం… పార్టీలో నిబద్ధతకు ప్రాధాన్యత పెంచడం. ఆ దిశగా చంద్రబాబు నాయుడు ప్రకటనలు ఇప్పుడు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. పార్టీని నమ్ముకున్నవారికి ప్రముఖ స్థానం ఉంటుందనే సంకేతాలు ఇవ్వాలి. పార్టీలో నాయకులకీ కేడర్ కి కావాల్సిన భరోసా ఇది. అంతేగానీ… సంక్షోభాలు పార్టీకి కొత్త కాదు అని ప్రకటించడం వల్ల ఉపయోగం ఏముంటుంది..? ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవాలంటే పార్టీకి లాయల్ ఉండేవారే ముందు వరుసలో నిలబడాలి కదా.