పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు వస్తాయని మళ్లీ విస్త్రతమైన చర్చ ప్రారంభమయింది. వచ్చే నవంబర్, డిసెంబర్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోందని ప్రతి రోజూ.. ఏదో ఓరూపంలో వార్త వస్తూనే ఉంది. నిజంగానే ముందస్తు ఎన్నికలు వస్తాయా.? ఏ కారణాల వల్ల ముందస్తుకు వెళ్లాలనుకుంటున్నారు..?
డిసెంబర్లో మూడు కీలక రాష్ట్రాల ఎన్నికలు..!
ఈ ఏడాది చివరిలో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉంది. సహజంగానే అక్కడ అధికార వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. రాజస్థాన్‌లో ఐదేళ్ల కిందటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. తీవ్రమైన అధికార వ్యతిరేకతను అక్కడి వసుంధర రాజే ప్రభుత్వం మూటగట్టుకుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గట్టెక్కడం కష్టమే. ఈ రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత మూడు నెలల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు వస్తే.. బీజేపీకి మెరుగైన ఫలితాలు రావడం సాధ్యం కాదు. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలలో కలిసి బీజేపీకి 63 సీట్లు వచ్చాయి. విడివిడిగా ఎన్నికలు జరిగితే.. ఈ సీట్లలో భారీగా కోత పడుతుంది. అదే జరిగితే.. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం.
కాంగ్రెస్ పార్టీతో నేరుగా పోటీ..!
ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలయింది. కాంగ్రెస్ పార్టీ విజయాలు దక్కించుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఓడిపోతే.. ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా మారిపోతుంది. నిజానికి బీజేపీకి ఈ పరిస్థితి గుజరాత్‌లోనే వచ్చింది. అయితే నరేంద్రమోడీ, అమిత్ షా ఇద్దరూ గుజరాతీయులే కావడంతో… గుజరాత్‌కు చెందిన ప్రధానిని.. గుజరాతీయులు ఎలా ఓడిస్తారన్న ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు. అక్కడ రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లుగా ప్రచారం చేశారు. పైగా కాంగ్రెస్‌కు బలమైన నేతలు లేరు. దాంతో బీజేపీ గట్టెక్కగలిగింది. కానీ గొప్పగా విజయం సాధించలేదు. ఓటింగ్ శాతం బాగా తగ్గింది. కానీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు రాష్ట్రాల్లో బలమైన నేతలున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత మోడీ అజేయుడు అన్న ఇమేజ్ను బీజేపీ బిల్డప్ చేసింది. దానికి తగ్గట్లుగా బీజేపీ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు నమోదు చేసింది. కానీ ఉపఎన్నికల్లో మాత్రం వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. గత ఉపఎన్నికల తర్వాత మోడీ అజేయుడు కాదన్న అభిప్రాయం ప్రారంభమయింది. ఏడాది చివరిలో జరగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతే… మోదీ మానియా అనేది అసలు లేదన్న అభిప్రాయం అంతటా వ్యాపిస్తుంది.
కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం…!
ముఖాముఖి పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇప్పటి వరకూ జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది కానీ… కాంగ్రెస్ గెలవడం లేదు. కానీ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఆ పార్టీ మళ్లీ రేసులోకి వచ్చినట్లవుతుంది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కూడా బలం పెంచుకుంటున్నాయి. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి. ఉత్తరాదిలో ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు.. రోజురోజుకు… బలం పెంచుకుంటున్నాయి. ఈ పార్టీలన్నీ సంప్రదాయంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓ వైపు కాంగ్రెస్ పుంజుకుని.. ఈ ప్రాంతీయ పార్టీలు కూడా.. అండగా నిలిస్తే.. బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అందుకే కాంగ్రెస్ బలం పెరగకుండానే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన బీజేపీ చేయవచ్చు.
పెట్రోచార్జీలు, ఆర్థిక వ్యవస్థ వెనుకబాటు గండం..!
యూపీఏ -2 హయాంలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. పెట్రోల్ ధరల పెరుగుదల దగ్గర్నుంచి ఆర్థిక వ్యవస్థ వెనుకబాటు వరకూ..అనేక సమస్యలు దేశాన్ని పట్టి పీడించాయి. మోడీకి కాలం కలసి వచ్చిందో ఏమో కానీ… ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు బాగా తగ్గాయి. కానీ ధరలు తగ్గించలేదు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల తగ్గిపోయింది. ఫలితంగా నిరుద్యోగం దగ్గర్నుంచి అనేక సమస్యలు వస్తున్నాయి. పెట్రోల్ చార్జీలపై భారం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తూండగా… ఆర్థిక వ్యవస్థ మందగనమం వల్ల ఏర్పడే సమస్యలు అనేక వర్గాల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో యూపీఏ-2 పరిస్థితి బీజేపీకి ఎదురు కావొచ్చని అంచనా. దీనికి విరుగుడు ముందస్తు ఎన్నికలే అని ఆలోచించే అవకాశం ఉంది.
ప్రతిపక్షాలు ఏకం కాక ముందే ఎన్నికల సమరం..!
బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకు ప్రతిపక్షాలన్నీ ఏకం కాలేదు. కానీ ఏకమయ్యే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను అంచనా వేసుకుని.. సిద్ధాంతాల ప్రాతిపదికగా అందరూ ఒకే వేదికపైకి రావడానికి కొంత సమయం పడుతుంది. విపక్షాలు ఏకమైతే.. బీజేపీకి గడ్డు పరిస్థితేనని ఇటీవలి కాలంలో ఉపఎన్నికల ద్వారా తేలింది. అందుకే.. విపక్ష పార్టీలన్నీ ఓ కూటమిగా మారే ప్రయత్నాల్లోఉండగానే.. ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీ చేస్తున్నట్లు సమాచారం. అలా చేయడం వల్ల ఎవరికి వారు పోటీ చేసి.. ఓట్లు చీలిపోయి.. లాభం పొందుతామని బీజేపీ భావిస్తోంది.
కాంగ్రెస్‌కు నిధులు సర్దుబాటు కాకుండా చేసే వ్యూహం..!
కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిధుల సమస్య పట్టి పీడిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒకే ఒక్క పెద్ద రాష్ట్రం పంజాబ్. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్నా… పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కొనేంత నిధులు లేవు. ఒక వేళ… మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే… ఆ పార్టీకి నిధులు వచ్చే సోర్సులు కూడా పెరిగినట్లవుతాయి. ఇప్పటి వరకూ బీజేపీకి విరాళాల వెల్లువ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేసులోకి వచ్చినట్లు అనిపిస్తే.. ఆ పార్టీకి విరాళాలు వస్తాయి. ఇది బీజేపీకి చిక్కులు తెచ్చి పెట్టే అంశమే. కాంగ్రెస్‌కు నిధుల సోర్సులు పెరగక ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన బీజేకి చేయవచ్చు.
ఏడాది చివరిలో ఎన్నికలకు సిద్ధపడితే రాజకీయ కారణాలతో ముందస్తుకు వెళతారా అన్న విమర్శలు బీజేపీపైకి వస్తాయి. అందుకే.. ఎన్నికల ఖర్చులు తగ్గించడానికి జమిలీ ఎన్నికలకు వెళ్తున్నామని.. ఆ దిశగా తొలి అడుగు వేస్తున్నామని బీజేపీ చెప్పుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీకి మాత్రం ఓ టెన్షన్ ఉంది. 2004లో ఆ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి దెబ్బతినడమే. అప్పట్లో వాజ్‌పేయి వద్దన్నా… అద్వానీ పట్టుబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ పరాజయం పాలయ్యారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితి వస్తుందేమోనని బీజేపీ నేతల భయం.